Employee Unions on Cabinet Decisions: ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు సీపీఎస్ రద్దు చేయలేమని చేతులెత్తేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన ఏపీ గ్యారెంటీ పింఛన్ విధానానికే పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సమావేశమైన మంత్రివర్గం.. పలు నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో భాగంగా 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. సీపీఎస్ స్థానంలో ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ బిల్లు- 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, వైద్య విధాన పరిషత్ రద్దు, మండలానికి 2 జూనియర్ కళాశాలలు, 3 నుంచి 10 తరగతి విద్యార్థులకు టోఫెల్ శిక్షణ వంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయాలు తమ ఉద్యమ ఫలితమే.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ..''మా ఉద్యమ ఫలితం వల్లే ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నేడు పలు నిర్ణయాలు తీసుకుంది. జీపీఎస్ విధి విధానాలు చెప్పలేదు. గతంలో 28శాతం పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు 50శాతం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఓపీఎస్ తరహాలోనే ఉద్యోగి చివరి జీతంలో 50శాతాన్ని ఫించనుగా ఇస్తున్నారు. ఓపీఎస్ తరహాలోనే ఏడాదికి రెండు సార్లు డీఆర్ ఇస్తామన్నారు. కానీ, ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్ కాదు.. ఓపీఎస్. బిల్లు పెట్టే నాటికి పాత పెన్షన్ విధానాన్ని ఆమోదిస్తారు'' అని ఆయన అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నాం.. మరోవైపు గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కె.వెంకట్రామి రెడ్డి స్పష్టం చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 16శాతం హెచ్‌ఆర్ఏను అమలు చేస్తూ.. కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నందుకు.. ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఏమీ లేని చోట ఏదో ఒకటి వచ్చింది.. అనంతరం మళ్లీ జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తుందని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ వెంకట్రామి రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ వేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారన్న ఆయన.. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావటం సంతోషదాయకమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 50శాతం పెన్షన్ ఇచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఏమీ లేని చోట ఏదో ఒకటి రావటం సంతోషమే కదా అని ఆయన వ్యాఖ్యానించారు.