69 Bridges Incomplete Under R and B : ప్రాధాన్య రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్య లేకుండా చూస్తూ. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. గతేడాది జూన్ 21న రహదారులపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. సీఎం చెప్పేది వింటే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, పనులన్నీ పూర్తవుతాయనే భ్రమ కలగడం ఖాయం.
Construction Works Delay on R and B Bridges in State : రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంటి ఆర్ అండ్ బీ వంతెనల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొత్తవాటి సంగతి అటుంచి, పనులు మధ్యలో ఆగిపోయిన వాటికి నిధులిస్తే వాటినైనా పూర్తి చేస్తామని అధికారులు మొత్తుకుంటున్నారు. 175 కోట్ల రూపాయలు కేటాయిస్తే అసంపూర్తిగా ఉన్న 27 వంతెనల నిర్మాణం వెంటనే పూర్తవుతుందని ప్రజల కష్టాలు తీరతాయని తెలిసినా.. నిధులిచ్చేందుకు సీఎంకి మనసు రావటం లేదు. జనానికి ఇవేమీ తెలియవనే ఉద్దేశంతోనే నిధుల లోటు లేకుండా పనులు పూర్తి చేస్తున్నామంటూ వారిని మభ్యపెడుతున్నారు.
Bridge Collapse: నిర్వహణ లోపం.. కుప్పకూలే దుస్థితికి చేరుకున్న పురాతన వంతెనలు..
రాష్ట్రంలో కొత్త రహదారుల నిర్మాణం, విస్తరణ ఊసే లేదు. కనీసం పనులాగిపోయిన వంతెనల నిర్మాణం పూర్తి చేయాలన్న ధ్యాసే లేదు. జనం ఎన్ని కష్టాలు పడితే మాకేంటి? నిధులిచ్చేదే లేదు అనేలా జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఆర్ అండ్ బీ పరిధిలోని జిల్లా, రాష్ట్ర రహదారుల్లో అసంపూర్తిగా ఉన్న వంతెనలు 60 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిని పూర్తి చేసేందుకు 734 కోట్ల రూపాయలు అవసరమని లెక్క తేల్చారు.
కొన్నాళ్ల కిందట వీటిపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సమీక్ష చేసి, వెంటనే పూర్తి చేయాల్సిన వంతెనలు.. నిధులెంత అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హమ్మయ్య ఇప్పటికైనా నిధులొస్తాయన్న ఆశతో 27 వంతెనల వివరాలతో జాబితా తయారు చేశారు. వీటి అంచనా విలువ 295 కోట్లు కాగా, ఇంకా 175 కోట్లు చెల్లిస్తే ఈ ఏడాది చివరికి పూర్తి చేస్తామని నివేదికలందజేశారు. నెలలు గడిచినా.. సీఎంవో అధికారులుగానీ, ఆర్ధికశాఖ నుంచి గానీ ఎలాంటి స్పందనా లేదు. ఏదో హడావుడిగా నివేదిక అడిగారేగాని, నిధులిచ్చే ఉద్దేశం సీఎం జగన్‌కు లేదని స్పష్టమైపోయింది.
ఆర్ అండ్ బీ అధికారులు పేర్కొన్న 27 వంతెనల్లో దాదాపు 20 వరకు గత ప్రభుత్వంలో మంజూరైనవే. సుమారు 70-80 శాతం పనులు పూర్తయ్యాయి. జగన్ సర్కార్ వచ్చాక వీటికి చెల్లింపులు నిలిపేశారు. గత ప్రభుత్వంలో మంజూరైనవాటిని ఎందుకు పూర్తి చేయాలన్న మొండివైఖరి ఈ సర్కారులో కనిపిస్తోంది. ఇప్పటికీ 12 కోట్ల మేర బిల్లులు C.F.M.S లో అప్‌లోడ్ చేసినా చెల్లింపులు లేవు. మరో 35 కోట్ల మేర బిల్లులు అప్‌లోడ్ చేసేందుకు చూస్తున్నారు. అయినా సరే వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
People Demand for Buggavanka Bridge రక్షణ గోడ కట్టారు.. ప్రయాణించే వంతెన నిర్మించడం మరిచారు
జగన్ సర్కారు తీరుతో విసుగుచెందిన గుత్తేదారులు ఇప్పటికే పనుల నుంచి వైదొలిగారు. గ్రామీణ రహదారుల్లో ఉన్న శిథిల వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు గత ప్రభుత్వంలో నాబార్డు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి కింద ఆరింటిని ఎంపిక చేశారు. అవి ఇంకా పూర్తి కాలేదు. జగన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా వాటికి నాబార్డు స్కీమ్ గడువు కూడా ముగిసిపోయింది.
ఇప్పుడు ప్రభుత్వం వీటికి 18 కోట్లు చెల్లిస్తేనే కొలిక్కి వస్తాయి. రాష్ట్ర రహదారుల్లోని వంతెనల్లో 12 అసంపూర్తిగా ఉండగా ఇవి అందుబాటులోకి వచ్చేందుకు 46 కోట్లు అవసరమవుతాయి. జిల్లా రహదారుల్లో వంతెనలు పూర్తిచేసేందుకు 111 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. సీఎం జగన్ సొంత ఇలాఖా వైఎస్సార్ జిల్లాలోనూ అసంపూర్తిగా ఉన్న 9 వంతెనలను పూర్తి చేసేందుకు 43 కోట్లు కావాల్సి ఉన్నా సర్కారులో చలనం లేదు.