VIJAYAWADA BOOK FESTIVAL : ఏటా ఔత్సాహికులను అలరించే పుస్తక మహోత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. మూడు దశాబ్దాలుగా విజయవాడ స్వరాజ్య మైదానంలో పుస్తక ప్రదర్శన జరిగేది. ప్రస్తుతం అక్కడ అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీంతో పుస్తక మహోత్సవాన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణకు మార్చారు. 33వ పుస్తక మహోత్సవాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లాంఛనంగా ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్టాళ్లను సందర్శించారు.
మాతృభాషను ప్రేమించేలా విద్యార్ధులను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగుది నాల్గో స్థానమన్నారు. అజ్ఞానాన్ని తొలగించే గురువు, స్నేహితుడిగా పుస్తకాలు నిలుస్తాయన్నారు. పిల్లలతో కలిసి పుస్తక ప్రదర్శనను సందర్శించి చదివేలా ప్రోత్సహించాలన్నారు.
"మాతృభాషపై ప్రేమ, అభిరుచి పెంపొందించడానికి పుస్తకాలు ఉత్తమ సాధనం. ఇతిహాసాలు, నీతి కథలను చదవమని ప్రోత్సహించిన నా చిన్ననాటి రోజులు ఇంకా గుర్తున్నాయి. స్వాతంత్రోద్యమ సమయంలోనూ.... అదే విధంగా అనేక సందర్భాల్లో పుస్తకాలు ఎంతో ప్రభావితం చేశాయి. యావత్ సమాజానికే మార్గనిర్దేశంగా నిలుస్తున్నాయి"-బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
పఠనాశక్తి కల్గినవారికి పుస్తక మహోత్సవం మంచి అవకాశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహనీయుల జీవిత చరిత్రలు, పరిశోధన గ్రంథాలతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పుస్తక ప్రదర్శనను విజయవాడలోని పాఠశాల, కళాశాల విద్యార్ధులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
"ఇతర భాషలను నేర్చుకునే ముందు మాతృభాషను ప్రేమించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. అప్పుడే మాతృభాషలోని ఇతిహాసాలను, నీతి కథలను వారు చదవగలుగుతారు. పుస్తకాలను విద్యార్థులకు దగ్గర చేసే బాధ్యత తల్లిదండ్రులు, గురువులదే. విజయవాడలో జరుగుతున్న ఈ గొప్ప పుస్తక ప్రదర్శనను చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు తప్పక సందర్శించాలి. ప్రపంచవ్యాప్తంగా 8.1 కోట్ల మంది తెలుగు మాట్లాడేవారున్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగుది నాలుగో స్థానం కావడం గర్వకారణం"-బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
ఈనెల 19వరకు.. ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు పుస్తక మహోత్సవం జరగనుంది. పుస్తకాలు కొనేందుకు ఔత్సాహికులు తరలివస్తున్నారు. ప్రతి బుక్‌పైనా 10శాతం రాయితీ ఇస్తున్నారు.
ఇవీ చదవండి: