Endowment Lands Occupied: దేవాదాయ శాఖ భూమికి మంత్రి బుగ్గన అనుచరుడు, డోన్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ హరికిషన్ ఎసరు పెట్టారు. ఆలయ భూమిని సొంత జాగీరులా కల్యాణ మండపం నిర్మాణానికి లీజుకిచ్చారు. అంతటితో ఆగకుండా.. ప్రారంభోత్సవానికి ఆయనే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంత జరుగుతున్నా దేవాదాయశాఖ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు.
డోన్ పరిధిలోని కొత్తబుగ్గ రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి సర్వే నెంబరు 561లో.. సుమారు 42 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇందులో 29.23 ఎకరాల స్థలాన్ని గతంలో పరిశ్రమల శాఖకు అప్పగించారు."ఆర్ ఎండ్ బీ" రహదారి విస్తరణకు, కుష్టు కేంద్రం నిర్మాణానికి మరికొంత పోగా., ఆలయం పేరిట 8.36 ఎకరాలు మిగిలింది. దీన్ని గతంలో అటవీ శాఖ నర్సరీకి లీజుకిచ్చారు.
లీజుకిచ్చిన 8.36 ఎకరాల భూమి: ఈ ఆలయం 2011లో దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లడంతో.. ధర్మకర్తల కమిటీ అధికారాలన్నీ రద్దయ్యాయి. అయినా ఆలయం పేరుతో మిగిలిన భూమిని డోన్ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ హరికిషన్ లీజుకు ఇచ్చారు. ప్రతి మూడేళ్లకు 33 శాతం లీజు పెంచేలా, పదేళ్ల కాలపరిమితితో శ్రీరంగ ఫంక్షన్ హాలుకు అప్పగించారు. ఈ నెల 4న ఫంక్షన్ హాల్‌ను హరికిషనే స్వయంగా ప్రారంభించారు. వుడా పరిధిలో డోన్‌కు ఆనుకొని రహదారి పక్కనే ఉండటంతో.. ఇక్కడ ఎకరం 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలకుపైగానే పలుకుతోంది. తొలుత ఫంక్షన్ హాలుకు లీజుకిచ్చినా.. కాలక్రమంలో ఆలయ భూమిని తమ వశం చేసుకోవాలన్న ఎత్తుగడ ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
ఆరోపిస్తున్న బీజేపీ నేతలు: ఆలయ భూమి దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లినట్లు తమకు తెలియదని.. మున్సిపల్ వైస్ ఛైర్మన్ హరికిషన్ అంటున్నారు. లీజుకిచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. గుడి అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని.. లీజు అద్దె దేవస్థానానికి చెందేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అయితే.. సంబంధిత ఒప్పంద పత్రాలను మాత్రం బయటపెట్టలేదు. అంటే.. ఏదో మతలబు ఉన్నట్లే కదా అని బీజేపీ నేతలు అంటున్నారు. తన ఇలాకాలో విలువైన దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతమవుతుంటే.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి: