Srisailam EO Lavanna Transfer Controversy: దేవాలయాలకు సంబంధించి రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శ్రీశైలం దేవస్థానంలో ఈవో లవన్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అతనిని ప్రభుత్వం బదిలీ చేసినప్పటికీ.. అదే స్థానంలో కొనసాగుతున్నారు.
అదే విధంగా లవన్న స్థానంలో నూతన ఈవోగా నియమితులైన అధికారికి సైతం దేవదాయ శాఖ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. దీంతో శ్రీశైలం దేవస్థానంలో మరోసారి వివాదం తలెత్తింది. గతంలో లడ్డూ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు, దర్శనాల దందా పేరుతో ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
శ్రీశైలంలో దర్శనాల దందా.. విచారణకు ఆదేశం
Srisailam Temple EO Lavanna Transferred: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (Executive Officer) యస్. లవన్న బదిలీపై వివాదం కొనసాగుతోంది. ఈవో లవన్నను ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్డీవోగా బదిలీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.పెద్దిరాజును శ్రీశైల దేవస్థాన నూతన ఈవోగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీశైల దేవస్థానం (Srisailam Temple) విధుల నుంచి లవన్న రిలీవ్ కాకుండా కొనసాగుతుండటంతో ఇటు ఉద్యోగులకు, అటు ట్రస్ట్ బోర్డు సభ్యులకు (Srisailam Temple Board of Trustees) తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. గతంలో బదిలీ అయినా.. ఈవోలు దేవస్థానంలోని పరిపాలన విభాగం అధికారులకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యేవారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పటికీ ఈవోగా కొనసాగుతుండడం సందిగ్ధంగా మారింది.
మరోవైపు నూతన ఈవోగా నియమితులైన పెద్దిరాజుకు దేవాదాయ శాఖ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన శ్రీశైల దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన ఉత్తర్వులు సైతం ఇవ్వకుండా దేవదాయ శాఖలో నాటకీయ పరిణామాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నుంచి రిలీవ్ ఉత్తర్వులు వచ్చే విధంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు, ధర్మకర్తల మండలి సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీశైలంలో లడ్డూ సరకుల ధరలు దారుణం: రెడ్డివారి చక్రపాణి రెడ్డి
గతంలోనూ పలు వివాదాలు: శ్రీశైల దేవస్థానం లడ్డూ తయారీ కోసం.. సరుకుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే విషయం కలకలం రేపింది. జీడిపప్పు, యాలకులు సహా నెయ్యి, నూనె తదితర సరుకులకు వాస్తవ ధర కన్నా భారీగా సొమ్ము చెల్లిస్తున్నట్లు తేలింది. ఒక్క నెలలో 42 లక్షల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారని, ఒకే గుత్తేదారు 20 ఏళ్లుగా ఉన్నారంటూ ఏకంగా ఆలయ ఛైర్మన్ అధికారులను నిలదీశారు.
అక్రమంగా దర్శనాల వివాదం: అదే విధంగా ఆలయంలో అక్రమంగా దర్శనాలు చేపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ ఆడియో వైరల్ అయింది. ధర్మకర్తల మండలి సభ్యురాలు ఒకరు అక్రమంగా దర్శనాలు చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. తాజాగా ఈవో లవన్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.