Constable murder video viral: నంద్యాల జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ల బరితెగింపునకు పరాకాష్ఠ ఈ దారుణం. రాత్రివేళ ఒంటరిగా బైక్‌పై వెళ్తున్న ఓ కానిస్టేబుల్‌ను వెంటాడి వేటాడి హత్య చేయడం సంచలనం రేపింది. తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న వ్యక్తిపై బీరు సీసాలతో దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డుకాగా, సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఫుటేజీలను పరిశీలిస్తే టెక్కెలోని టాటూ దుకాణం వద్ద ఆదివారం రాత్రి మద్యం తాగుతున్న రౌడీషీటర్లకు కానిస్టేబుల్ సురేంద్రకుమార్ (35) కనిపించారు. అతనితో వారు గొడవకు దిగారు. మాట్లాడుతుండగానే తమ వద్ద ఉన్న బీరు సీసాలతో సురేంద్ర తలపై దాడి చేశారు. నిందితులు ఆరుగురు ఉండటంతో వారినుంచి తప్పించుకునేందుకు సురేంద్ర పద్మావతి సర్కిల్ వైపు పరుగులు తీశారు. నిందితులు అతడిని వెంటపడి పట్టుకుని పక్కనే ఉన్న ఆటోలో ఎక్కించారు. ఆటోడ్రైవర్‌ను కొట్టి, అతని మెడపై కత్తి పెట్టి పట్టణ శివారులోని చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లారు. తలకు దెబ్బ తగలడంతో అప్పటికే స్పృహ కోల్పోయిన సురేంద్ర గుండెలో, వీపుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటనాస్థలి నుంచే ముగ్గురు పరారుకాగా, మరో ఇద్దరు పట్టణంలోకి వచ్చి బుల్లెట్ వాహనాలపై వెళ్తున్న వారిని కొట్టి వారి వాహనాలు తీసుకొని పరారైనట్లు సమాచారం.
ముమ్మరంగా గాలింపు
నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేంద్రకుమార్ హత్యపై ఎస్పీ రఘువీర్‌రెడ్డి సంబంధిత పోలీస్‌స్టేషన్ సీఐ, ఎస్సై, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ ఘటనపై కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ ఎంవీ రమణ తెలిపారు. మరోపక్క, సురేంద్ర మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎస్పీ సందర్శించి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. సాయంత్రం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఇవీ చదవండి: