శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.46 గంటలకు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో ఎస్. లవన్న, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ, కంకణ పూజలను నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ రాత్రి 7 గంటలకు మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం చైర్మన్, ఈవో తెలిపారు.
స్టీమ్ బాయిలర్ పేలుడు: శ్రీశైలంలోని దేవస్థానం అన్నపూర్ణ భవన్ లో స్టీమ్ బాయిలర్ మరోసారి పేలింది. ఇవాళ ఉదయం భక్తులకు భోజనం తయారు చేసే క్రమంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా విజయవాడ నుంచి కొందరు భోజనాలు తయారు చేసేందుకు కాంట్రాక్టు కింద పనిచేయడానికి శ్రీశైలం వచ్చారు. వారు బాయిలర్ వద్ద ఉండగా ఒక్కసారిగా పేలిపోయింది. బాయిలర్ లోని వేడి నీళ్లు పడడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక బాలుడికి గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతున్న బాధితులను దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో బాధితులను చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు మహిళలను మెరుగైన వైద్యం కోసం మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. స్టీమ్ బాయిలర్ నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడం వలన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నవంబర్ నెలలో ఇదే తరహాలో స్టీమ్ బాయిలర్ పేలినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో దేవస్థానం అధికారులు విఫలం అయ్యారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అన్నదానం వంటశాల వద్ద స్టీమ్ బాయిలర్లు పేలుతున్నప్పటికీ అధికారులు మొక్కుబడిగా వ్యవహరించడం వలన ప్రాణాల మీదికి వస్తుందని అక్కడ పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. రోజుకు సుమారు 5000 మందికి పైగా భోజనాలు, అల్పాహార ప్రసాదాలు తయారు చేయాల్సి వస్తుండగా, బాయిలర్లు అమాంతం వేడెక్కి పేలుతున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ భవన్లో కొత్తగా బాయిలర్ ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని వినియోగించకపోవడం వలన ఈ సమస్య లు తలెత్తుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని.. భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి