YSRCP leader attacked on Dalit family: తమకు అనుకూలమైన పార్టీ అధికారంలో ఉంది.. ఎమ్మెల్యే మనోడే.. తాము ఏం చేసిన చెల్లుతుంది.. అడిగే వాడే లేడు.. అడ్డొచ్చేవాడు లేడనుకున్నాడు అతను. అందుకు అమయాకులైన దళితులను టార్గెట్ చేసుకున్నాడు. వారి భూమిలోకి వచ్చి వారిపైనే దాడి చేయడంతో ఆ కుటుంబం ఆసుపత్రి పాలైంది. తమపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరుడిని వెంటనే అరెస్టు చేయాలని వారు పోలీసు సేషన్ తలుపుతట్టిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. పత్తికొండ మండలం చిన్నహుల్తి సమీపంలో ఓ పొలం విషయంలో, దళిత యువకుడిని వైసీపీ నేత చితకబాదారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ముఖ్య అనుచరుడైన అటికలగుండు బాబిరెడ్డి, మధు అనే యువకుడిపై దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులను చితకబాదారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ప్రశ్నిస్తే దాడి చేశాడు: తమ భూమిలోకి వచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని అడిగినందుకు దూషించడమే కాకుండా తమపై బాబిరెడ్డి దాడి చేశారని యువకుడు వాపోయాడు. తనపై, తన తండ్రి, సోదరుడినిపై సైతం దాడి చేసినట్లు మధు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలోకి వచ్చి అన్యాయం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తే ఇది మీ భూమారా..! అంటా అసభ్యపదజాలంతో బాబిరెడ్డి దూషించారని పేర్కొన్నారు. వారికి ఎమ్మెల్యే పలుకుబడి ఉందని అందుకోసమే బాబిరెడ్డి తమపై దాడి చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ నేత దాడిలో ఆ యువకుడికి వారి కుటుంబసభ్యులకు గాయాలుకావడంతో వారిని ఆంబుులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
'అటికలగుండు బాబిరెడ్డి మా పొలంలోకి ప్రవేశించి అక్రమంగా మాపై దాడి చేశారు. ఇదేంటని ప్రశిస్తే అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా తనపై, తన తండ్రిపై తన సోదరుడిపై దాడిచేశాడు. 60 సంవత్సరాల వయసున్న మా తల్లిదండ్రులను, మా అన్నయ్యను పొలంలో పరిగెత్తిస్తూ కొట్టాడు. తమకు అతని నుంచి ప్రాణాపాయం ఉంది. తమ భూమిలోకి వచ్చి అన్యాయం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తే, ఇది మీ భూమారా..! అంటూ అసభ్యపదజాలంతో దూషించారు. దళితులమైన మాకు అన్యాయం జరుగుతుంటే పోలీసు కేసుపెట్టడానికి వచ్చాం. పోలీసులు, రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.' మధు, బాధితుడు
ఇవీ చదవండి: