Tidco Houses: అది 2017వ సంవత్సరం. పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు... కేంద్ర సర్కార్ సహకారంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కోఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలో టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. 2019లో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే సమయానికి ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో గృహప్రవేశాలు ఆగిపోయాయి.
వైసిపీ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల తర్వాతైనా తమకు ఇళ్లు ఇస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. చూస్తుండగానే మూడున్నరేళ్లు గడిచిపోయాయి. రెండుసార్లు మంత్రుల ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ పేరిట హడావుడి కూడా చేశారు. కానీ లబ్ధిదారులకు మాత్రం ఇళ్లు అప్పగించలేదు. అద్దె ఇళ్లకు కిరాయి కట్టుకోలేక, ఇంటి నిర్మాణం కోసమని తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక సతమతవుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంటి సంగతి దేవుడెరుగు... ముందు తాము కట్టిన డబ్బులు తిరిగివ్వమని కొంతమంది వేడుకుంటున్నారు.
టిడ్కో లబ్ధిదారుల కోసం మూడురకాల ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. 300 చదరపు అడుగుల ఇంటి కోసం 5 వందలు, 365 చదరపు అడుగుల ఇంటి కోసం 50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటి కోసం లక్ష రూపాయలు చొప్పున లబ్ధిదారులు చెల్లించారు. వీరిలో చాలా మందికి ఇప్పటికీ ఇళ్లు ఇవ్వలేదు. అసలు ఇస్తారో లేదో కూడా చెప్పకపోవడం లబ్ధిదారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసి అన్నివిధాలా నష్టపోయామని లబ్ధిదారులు అంటున్నారు . ఇప్పటికైనా తమ ఇళ్లు అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: