Worst roads in kurnool district: కర్నూలు జిల్లా డోన్ నుంచి బేతంచర్ల వెళ్లేందుకు 2016 కు ముందు ఒకే వరుస రహదారి ఉండేది. ఈ మార్గంలో గనులు, పరిశ్రమలకు తోడు పుణ్యక్షేత్రమైన మద్దిలేటి స్వామి ఆలయం ఉండడంతో రహదారిపై రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీని వల్ల ప్రమాదాలు జరుగుతుండటంతో... ఈ రహదారిని రెండు వరుసలుగా మార్చేందుకు 2017లో గత ప్రభుత్వం రూ. 27 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. డోన్ నుంచి బేతంచర్ల వరకు 33 కిలోమీటర్లు విస్తరణ పనులు, పలుచోట్ల వంతెనల ఏర్పాటుతో పాటు.. బీటీ రోడ్డు వేయాల్సి ఉంది. విస్తరణ పనులు చేపట్టినా... కొన్నిచోట్ల ఒక లేయర్ వేసి వదిలేయడంతో రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి.
కంకర వేసి వదిలేశారు...
బేతంచర్ల-రంగాపురం మధ్యలో మిట్ట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రహదారిని రెండు వరుసలు చేయాల్సి ఉన్నా.. దాదాపు ఒక కిలోమీటరు మేర కంకర వేసి వదిలేశారు. ఈ ప్రాంతంలో మలుపు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు అంటున్నారు. డోన్ మండలం చిన్న మల్కాపురం స్టేషన్ రహదారిలో కంకర వేసి వదిలేయటంతో.. వాహనాలు వెళ్లేటప్పుడు రాళ్లు ఎగిరి పడుతున్నాయని మహిళలు వాపోతున్నారు. డోన్ నుంచి బేతంచర్ల మధ్య చాలా వరకు పనులు పూర్తయ్యాయని.. రెండు చోట్ల మాత్రమే పనులు చేపట్టాల్సి ఉందని ఆర్ అండ్ బీ ఇంఛార్జి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ రోడ్డు జాతీయ రహదారిగా మారడంతో పనులను నేషనల్ హైవే అథారిటీకి అప్పగించామని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.
డోన్ నుంచి బేతంచర్ల మార్గంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవటంతో.. తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కంకర వేసి వదిలేయటంతో..వాహనాలు వెళ్లేటప్పుడు రాళ్లు ఎగిరి పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నాము.- వాహనదారులు
ఇదీ చదవండి