రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, తెలుగుదేశం పార్టీ బలోపేతం, నేతలలో ఆత్మవిశ్వాసం పెంపొదించేలా కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఆయన పర్యటన జరుగుతుంది. ఉదయం 10.30 గంటలకు కర్నూలు-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. టోల్ గేట్ నుంచి 12 కి.మీ మేర భారీ ర్యాలీతో... గుత్తి పెట్రోలు బంకు మీదుగా వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. నేటి నుంచి మూడు రోజులపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.
మొదటి రోజు ఇలా..
ఇవాళ 5 వేల మంది నేతలు, నియోజకవర్గ బాధ్యులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నుంచి ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్షిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో 500 మందితో సమావేశం కానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా పరాజయం, నేతల రాజీనామాలు, తెదేపా కార్యకర్తలపై కేసులు, దాడులు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రభుత్వ పథకాల తీరుపై అనుసరించాల్సిన వ్యూహాలపై తెదేపా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
రెండోరోజు...
ఆదోని, మంత్రాలయం, ఆలూరు, బనగానపల్లి, డోన్ నియోజకవర్గాల్లో 35 మంది తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా నాయకులు భౌతిక దాడులు, అక్రమ కేసుల నమోదు, ఎస్సీ, ఎస్టీ కేసులు, ఆస్తినష్టం వంటి కేసులు బనాయించారు. మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు వారితో సమావేశమై... పార్టీ తరఫున భరోసా కల్పించనున్నారు. అనంతరం ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నియోజకవర్గాలవారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షిస్తారు.
మూడో రోజు..
బనగానపల్లి, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. చివరిగా పాత్రికేయుల సమావేశంతో చంద్రబాబు పర్యటన ముగియనుంది.
ఇదీ చదవండీ: నేటి నుంచి చిత్తూరు జిల్లాలో జనసేనాని పర్యటన