తెలంగాణలో ఓ యువతిపై అత్యాచారం జరిగితే ఏపీలో దిశా చట్టం తెచ్చారని, రాష్ట్రంలో ముస్లిం మహిళపై అత్యాచారం జరిగి ఏడాది గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ ప్రశ్నించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఎర్రబాడు ప్రాంతంలో గతేడాది హత్యకు గురైన ఓ మహిళ ఇంటి ఎదుట మంగళవారం సమితి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫారూక్ షుబ్లీ మాట్లాడుతూ గతేడాది ఆగస్టు 17న పొలానికి వెళ్తున్న మహిళపై కొందరు కామాంధులు అత్యాచారం చేసి హత్య చేస్తే పోలీసులు నేరస్థులను పట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. పేదలకు న్యాయం చేయలేని పక్షంలో హోంమంత్రి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయకపోతే ఐకాసను ఏర్పాటు చేసి జులై 31న కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు మాలిక్, జిల్లా అధ్యక్షుడు సమీబాషా, కర్నూలు పార్లమెంట్ తెదేపా మహిళా అధ్యక్షురాలు ముంతాజ్‌బేగం, ఖాదర్‌బాషా, మౌలానా అబ్దుల్ లతీఫ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. Penna Cements case: నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదు: సీఎం జగన్