శ్రీశైలం దేవస్థానంలో ఇంటిదొంగలు ఎక్కువైపోయారు. కోట్లాది రూపాయల స్వామివారి సొమ్మును దోచుకుంటున్నారు. తాజాగా... దర్శనం, అభిషేకం టిక్కెట్ల సొమ్మును అక్రమార్కులు పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మూడేళ్ల వ్యవధిలో... కోటీ 42 లక్షల కుంభకోణం జరిగినట్లు తేల్చారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా... వెంటనే స్పందించిన ప్రభుత్వం దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను దర్యాప్తు అధికారిగా నియమించింది.
దీనిపై లోతైన విచారణకు ఆదేశించింది. రామచంద్రమోహన్ శ్రీశైలం చేరుకుని... అవకతవకలపై విచారణ ప్రారంభించారు. టిక్కెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లలో అక్రమాలు, పెట్రోల్ బంకులో అవినీతి, డొనేషన్ కౌంటర్లో అవకతవకలు, అకామిడేషన్ల విషయంలో జరిగిన గోల్ మాల్ తదితర అంశాలపై విచారణ జరపనున్నారు. రెండ్రోజుల్లో విచారణ పూర్తిచేసి... నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు రామచంద్ర మోహన్ తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పోలీసు శాఖ తరఫున మరో కమిటీని నియమించారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే శ్రీశైలం చేరుకుంది. ఆర్జిత సేవల టిక్కెట్ల విషయంలో జరిగిన కోటీ 40 లక్షల రూపాయల అవినీతిపై విచారణ ప్రారంభించారు. కంప్యూటర్లో సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఏ విధంగా మోసాలకు పాల్పడ్డారనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
మూడేళ్ల కిందట దేవస్థానం ఉన్నతాధికారులు శ్రీశైలం కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేయించారు. ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా బ్యాంకు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై రెండు మూడ్రోజుల్లో విచారణ పూర్తి చేయనున్నట్లు డీఎస్పీ వెంకట్రావు తెలిపారు.
శ్రీశైలం దేవస్థానంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చి... అక్రమార్కులను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.