జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో కరోనా వైరస్ నియంత్రణకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైరస్ ప్రబలకుండా భక్తుల రద్దీని తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట, ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఆలయంలో కేవలం నిత్యకైంకర్యాలు మాత్రమే జరగనున్నాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలంలో ఈ రాత్రికి స్వామి అమ్మవార్ల దర్శనానికి కూడా నిలుపుదల చేయడానికి అధికారులు నిర్ణయించారు. శ్రీశైలానికి కర్ణాటక నుంచి వచ్చే బస్సులను అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. రేపటి నుంచి శ్రీశైలంలో పూర్తిస్థాయిలో దర్శనాలు నిలిపివేయనున్నారు.
ఉగాది మహోత్సవాలు నిలిపివేత
కరోనా ప్రభావం వలన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు సైతం తమ పాదయాత్రను నిలుపుదల చేసుకొని తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి సూచించారు.
ఇదీ చదవండి : బస్సులో కరోనా కలకలం...ప్రయాణికుల కలవరం