కర్నూలు జిల్లా గోనెగండ్ల వద్ద కాలువలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. మృతుడు దేవనకొండ మండలం కూకటికొండకు చెందిన గొల్ల గోపాల్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు గొల్ల గోపాల్ భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికి వివాహం చేశాడు. ఒంటరితనాన్ని భరించలేక రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. మంచి సంబంధం చూడాల్సిందిగా పెళ్లిల్ల పేరయ్య కుమ్మరి ఈరన్నను సంప్రదించాడు.
విషయం తెలిసిన గోపాల్ పెద్ద కుమారుడు రంగడు మళ్లీ పెళ్లి వద్దని వారించాడు. 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకోవటమేంటని నిలదీశాడు. కుమారులతో గొడవపడ్డ గోపాల్.. గత 3 నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో పరువు, ఆస్తి పోతుందని భావించిన రంగడు..పెళ్లిళ్ల పేరయ్యను కలిసి విషయం తెలిపాడు. మా నాన్నకు పెళ్లి సంబంధాలు చూడొద్దని..,ఈ వయస్సుల్లో రెండో పెళ్లి చేసుకుంటే పరువుతో పాటు ఆస్తి కూడా పోతుందని చెప్పాడు. అంతటితో ఆగకుండా గోపాల్‌ను కడతేర్చేందుకు ఈరన్నకు రూ. 1.5 లక్షల సుపారీ ఇచ్చి పథకం రచించాడు.
పథకంలో భాగంగా..ఈనెల 14న పెళ్లి సంబంధం ఉందని నమ్మబలికిన ఈరన్న ఎమ్మిగనూరు రావాలని గొల్ల గోపాల్‌కు చెప్పాడు. అది నమ్మని గోపాల్ ఎమ్మిగనూరు రాగా.. ఈరన్న, బోయ మల్లికార్జున అనే ఆయనను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని గోనెగండ్ల వద్ద నున్న కాలువ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మాటు వేసి రంగడు..ఈరన్న, బోయ మల్లికార్జున సాయంతో గోపాల్‌ను దారుణంగా హత్య చేసి కాలువలో పడేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రోజుల వ్యవధిలోనే కేసును చేధించామని డీఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి