కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై గతేడాది నవంబర్ 8న నమోదు చేసిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవలే నిర్ణయాన్ని వెల్లడించింది.
సరైన మార్గంలోనే..
కర్నూలు జిల్లా ఎస్పీ వేసిన అఫిడవిట్‌పై దర్యాప్తు సరైన మార్గంలో కొనసాగుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సీబీఐకి బదలాయించాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ సీబీఐ అధికారులు అఫిడవిట్ వేస్తూ బ్యాంకులను మోసం చేసిన కేసులు, అవినీతి కేసుల దర్యాప్తుతో అధిక భారాన్ని మోస్తున్నామన్నారు. ప్రస్తుత కేసు అంతరాష్ట్ర, అంతర్జాతీయ వ్యవహారాలు ముడిపడి లేవని స్పష్టం చేశారు.
అరుదైన, అసాధారణ ఉన్నప్పుడే..
రాష్ట్ర పోలీస్ అథారిటీ ప్రత్యేక ఏజెన్సీ ఈ కేసులో దర్యాప్తు చేయవచ్చని పేర్కొన్నారు. అరుదైన, అసాధారణ కేసుల్లో అధికరణ 226 కింద హైకోర్టు .. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చన్నారు.
'సీబీఐకి అక్కర్లేదని భావిస్తున్నాం'
2010లో సుప్రీం ఓ కేసులో తీర్పు ఇస్తూ.. కేసుల దర్యాప్తును వేరే విభాగానికి బదిలీ చేసే అంశంలో న్యాయస్థానం తన అధికారాన్ని జాగ్రత్తగా వినియోగించాలని పేర్కొన్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. పరిమితమైన వనరులతో సీబీఐ ఎక్కువ కేసుల దర్యాప్తులో తలమునకలై ఉంటుందని సుప్రీం తెలిపినట్లు హైకోర్టు గుర్తు చేసింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సలాం కుటుంబ ఆత్మహత్య కేసు కేంద్రానికి బదిలీ చేసే ఆవశ్యకత ఏమీ లేదని అభిప్రాయపడుతున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: