కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని రాతి వనాలు సహజ సౌందర్యంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ సహజసిద్ధమైన ఏర్పడిన రాళ్లు... వివిధ ఆకృతులతో ఇట్టే కట్టిపడేస్తాయి. పచ్చని చెట్ల మధ్యలోంచి కాస్తంత లోపలికి వెళితే ఏ శిల్పి చెక్కాడా అనే అనుమానం కలుగక మానదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ రాళ్ల మధ్యన నిలబడి సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరు. మరికొందరు ఫోటో షూట్ కోసం ఇక్కడికి వస్తుంటారు. సీరియళ్లు, సినిమాలు ఎన్నో జరిగాయి ఇక్కడ.
ఎన్నో అందాలు
రాతి వనాల సందర్శనకు వచ్చే వారి కోసం ప్రత్యేక గదులు, హరిత రెస్టారెంట్ ఉన్నాయి. పిల్లల కోసం క్రీడా పరికరాలు, కొండల మధ్య వెలసిన చెరువుపై వంతెన, పనికిరాని ఇనుప వస్తువులతో తయారు చేసిన జంతువులు, పక్షుల ప్రతిమలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. రాతివనాల్లోకి వెళ్లాలంటే పెద్దలకు 10 రూపాయలు, పిల్లలకు 5 రూపాయల టికెట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పర్యాటకులు సందర్శించే అవకాశం కల్పించారు. రాతివనాలు పర్యాటకుల తాకిడితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. సహజ సిద్ధమైన కొండల మధ్య వెలసిన చెరువు చూపరులను కట్టిపడేస్తుంది.
ఆసియాలో అతి పెద్దవి!
అగ్ని పర్వతాలు బద్దలవటంతో ఏర్పడ్డ అతి సహజసిద్దమైన ప్రకృతి అందాలే ఈ రాతి వనాలు. ఈ రాక్ గార్డెన్స్ ఆసియా ఖండంలోనే అతి పెద్దవని... కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడినవని చరిత్రకారులు చెబుతున్నారు. కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిని ఆనుకునే రాక్ గార్డెన్స్ కనువిందు చేస్తాయి. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో రాక్ గార్డెన్స్ విస్తరించాయి. ఈ రాళ్లలో క్వార్జ్, సిలికా, గాజు ఇతర ముడి పదార్థాలు ఉన్నట్లు నిర్ధారణైంది. లాక్ డౌన్ కాలంలో రాక్ గార్డెన్స్ ను మూసివేశారు. ఈ మధ్యనే పర్యాటక ప్రదేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో ప్రారంభించారు. ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇదీ చూడండి షారుక్- అట్లీ సినిమాకు రెహమాన్ సంగీతం!