ROADS IN KURNOOL: కర్నూలు నగరంలో ప్రధాన రహదారులు పర్వాలేదనిపించినా అంతర్గత రోడ్లు అద్వానంగా ఉన్నాయి. ఈటీవీ- ఈటీవీ భారత్ బృందం సంతోష్ నగర్ ఆటో స్టాండ్ నుంచి స్టాంటన్ పురం వెళ్లే అంతర్గత రోడ్డును పరిశీలించింది. 2 కిలోమీటర్లుండే ఈ దారిలో 164 గుంతలు కనిపించాయి. ఈ మార్గంలోనే కోడుమూరు ఎమ్మెల్యే కార్యాలయంతో పాటు 3 ఫంక్షన్ హాళ్లున్నాయి.
సంతోష్ నగర్- స్టాంటన్‌పురం మార్గం ఒకప్పుడు పంచాయతీ పరిధిలో ఉండేది. సుమారు పదేళ్ల క్రితం నగరపాలక సంస్థలో వినీనమైంది. ప్రజలకు పన్నుల భారం పెరిగిందేగానీ.. రోడ్డు దుస్థితి మారలేదు. దుమ్ముదూళి, గోతులతో.. అనేక మంది వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. వర్షాకాలం వస్తే గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డు కోసం కోటి 80 లక్షల రూపాయలు మంజూరు చేసినా ఇంతవరకూ పనులు ప్రారంభించలేదు.
కర్నూలు నగరంలో కప్పల్ నగర్ నుంచి అశోక్ నగర్ వెళ్లే మార్గంలో గోతులు మరీ ఎక్కుగా ఉన్నాయి. మమతానగర్, బాలాజీనగర్, వెంకటరమణ కాలనీ, సంతోష్ నగర్ తదితర కాలనీల ప్రజలు ఈ మార్గం నుంచీ అశోక్ నగర్ వైపు వెళ్తారు. వాహనదారులకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఈ మార్గంలో ప్రయాణం అంటేనే ప్రసహనంలా మారింది. నిత్యం వందల వాహనాలు ఈ రోడ్డులో వెళ్తాయి.
ఇవీ చదవండి: