కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కాసింతల క్షేత్ర సమీపంలో 40వ జాతీయ రహదారిపై కారు.. బైకును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కర్నూలు నుంచి కడప వైపు వెళ్తున్న కారు ఆళ్లగడ్డ సమీపంలోకి రాగానే టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. పల్టీలు కొడుతూ మరోవైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.
మృతులు సిరివెళ్లకు చెందిన షేక్ ఆయాజ్, ముల్లా కలాం, షేక్ జాకీర్గా గుర్తించారు. వీరు ముగ్గురు భవన నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ రాజేంద్ర ఘటనాస్థలికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: Murder : ఆస్తి కోసం తగాదా... తండ్రిని హత్య చేసిన కుమారుడు..