కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట నుంచి ఆదోని వరకు 55 కిలో మీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులను 2017లో రూ. 172 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఆలూరు నుంచి ఆదోని వరకు 26 కిలోమీటర్ల సిమెంట్ రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఇసుక కొరత, నీటి సమస్యలతో సీసీ రోడ్డు రద్దు చేసి తారురోడ్డు వేసేందుకు నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు విలువ రూ. 152 కోట్లకు కుదించారు. 2019 మే 31 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా గుత్తేదారు 2020 నవంబర్ నెలాఖారు వరకు గడువు కోరారు. పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో ఇప్పటి వరకు 30 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. పూర్తయిన రహదారులు సైతం గుంతలుగా మారి కంకర తేలిపోతుంది. విస్తరణ పనులు జరుగుతున్న చోట ఎలాంటి సూచికలు, రేడియం స్టికర్లు ఏర్పాటు చేయకపోవటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు వెట్ మిక్సర్పై క్యూరింగ్ చేయకపోవటంతో దుమ్ము, దూళితో ద్విచక్ర వాహన చోదకులు నరకం అనుభవిస్తున్నారు. రహదారి వెంట ఉన్న పొలాల్లో పంటలపై దుమ్ముపట్టి పంట నష్టం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే రహదారి రొచ్చుగా మారి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. 3 నెలల వ్యవధిలో పదికి పైగా ప్రమాదాలు జరిగాయి. సబ్ బేస్‌లో గ్రావెల్ బదులు పెద్ద బండరాళ్లు పరిచారు. కంకరలోను డస్ట్ ఎక్కువగా ఉండటం, తెల్ల మట్టి ఉపయోగించారు. దీంతో రోడ్డు పూర్తయినా ఉపయోగం లేకుండా పోతోంది.
ఇవీ చదవండి..