కర్నూలు జిల్లాలో మండల పరిషత్, జడ్పీ, ప్రభుత్వ యాజమాన్యంలో 1,765 ప్రాథమిక పాఠశాలల్లో 1,62,001 మంది, 342 ప్రాథమికోన్నత పాఠశాలలో (1-5 తరగతులు) 32,318 మంది, (6-8)లలో 13,431 మంది విద్యార్థులు ఉన్నారు. 413 ఉన్నత విద్యాలయాల్లో 1,36,951 మంది విద్యార్థులు చైల్డ్‌ఇన్ఫోలో నమోదయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వు 53 ప్రకారం విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి ఆధారంగా పాఠశాలలకు కేటాయింపులు చేయడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు. గతేడాది కంటే 2020-21 విద్యా సంవత్సరానికి 6 వేల మంది విద్యార్థుల హాజరు పెరిగింది. వీటి ఆధారంగా ప్రైమరీ స్కూల్‌లో
సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)లో 160 మంది మిగులు ఉండగా, 1,392 మంది అవసరమని, ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం కేటగిరీలో 181 మంది మిగులు ఉండగా, 32 మంది అవసరమని గుర్తించారు. ఉన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు 106 మంది మిగులు ఉండగా, ఇంకా 1,150 మంది అవసరమని తేలింది. వీరందర్నీ కలెక్టర్ అనుమతితో సోమవారం నుంచి అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు.
కేటాయింపుల్లో.. విధి విధానాలు
విద్యాహక్కు చట్టం ఆధారంగా పాఠశాలల పునర్విభజనను చేపట్టారు. దీని ప్రకారం ప్రాథమిక పాఠశాల-1:30, ప్రాథమికోన్నత- 1:35, ఉన్నత పాఠశాల-1:40 ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని ప్రామాణికంగా తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 53 ప్రకారం చైల్డ్‌ఇన్పోలో నమోదైన సంఖ్యకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.
ప్రైమరీ స్కూల్‌లో 30 మంది లోపు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు, ఇదే యాజమాన్యంలో 60 లోపు విద్యార్థుల వరకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఆపైన 61-90 వరకు విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులను, 91-120 వరకు నలుగురు, 121-150 వరకు ఐదుగురు, 151-200 మంది వరకు 1+5 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ప్రతి 40 మందికి ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు.
ఇదీ చదవండి: