కర్నూలు నగర నడిబొడ్డున ఉన్న కె.ఎస్.కేర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి నిర్వాహకులు జనవరి 23న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్నారు. ఆసుపత్రికి అగ్నిమాపక శాఖ అనుమతి లేకపోవడంతో వారు ఈ దరఖాస్తును పెండింగులో పెట్టారు. మరోవైపు ఓ ప్రజాప్రతినిధి ద్వారా ఆస్పత్రిని ప్రారంభించేశారు. నాలుగు నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గతంలో కర్నూలులో జేపీ ఆసుపత్రి, ఆదోనిలో ఓ ఆస్పత్రికి అనుమతులు మంజూరు చేశారు. ఆ తర్వాత వాటిలో నకిలీ వైద్యులను గుర్తించి పట్టుకున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు.
అనధికారికంగా కొవిడ్ వైద్యం
కొవిడ్ వైద్యం చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి ఉండాలి. కానీ కర్నూలు నగరంలో కొందరు నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే డబ్బులకు ఆశపడి యథేచ్ఛగా కొవిడ్ రోగులను చేర్చుకుని వైద్యం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు విజిలెన్స్ అధికారుల దాడుల్లో బయటపడ్డాయి. గాయత్రీ, వనమాలి ఆస్పత్రులను అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. నగరంలో ఇలాంటి ఆస్పత్రులు చాలానే ఉన్నా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం కళ్లు మూసుకుని ఉండటం గమనార్హం.
ముఖ్యంగా ఆక్సిజన్ సమస్యతో చేరే రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌లో రెండు ఆస్పత్రులు, చాణిక్యపురిలోని ఓ ఆస్పత్రికి కొవిడ్ చికిత్సకు అనుమతులు ఉన్నాయి. కాగా ఇక్కడ ప్రభుత్వానికి చూపుతున్న పడకలకు, చికిత్స పొందుతున్న వారి సంఖ్యకు పొంతనే లేదు. ప్రభుత్వానికి తక్కువ సంఖ్యలో చూపి మిగిలిన బెడ్లలో చేరిన రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారు. మరోవైపు కొందరు నాయకుల అండదండలు ఉండటం.. విషయం తెలిసినా అధికారులు తనిఖీ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
విచారణ చేయిస్తున్నాం: కలెక్టర్
నగరంలోని కె.ఎస్. కేర్ ఆసుపత్రిలో కొవిడ్ రోగులు ఇద్దరే చనిపోయారని, అది కూడా నిర్ధారణ కాలేదని కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. తాను, ఎస్పీ ఆసుపత్రిని తనిఖీ చేశామని ఆక్సిజన్ వినియోగం జరుగుతోందని వివరించారు. మరణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామన్నారు. తప్పని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆక్సిజన్ విషయంలో స్వయంగా తానే బళ్లారి, వైజాగ్ ప్లాంట్ల ప్రతినిధులతో పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉండగా ప్రతిరోజూ 38 మెట్రిక్ టన్నుల సరఫరా చేస్తున్నామన్నారు. రోజూ 25 నుంచి 28 టన్నులు వినియోగిస్తున్నారన్నారు. మరో 2 వేల పడకలు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రులను, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను సంప్రదించాలన్నారు. అక్రమాలకు పాల్పడే ఆసుపత్రులను గుర్తించేందుకు తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: