ఎల్లమ్మ జాతర ..
కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో వెలిసిన ఎల్లమ్మ జాతర వైభవంగా జరిగింది. జాతర సందర్భంగా నిర్వహించిన మహా రథోత్సవానికి కర్ణాటక, తెలంగాణ, నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామ పురవీధుల్లో రథోత్సవం ఊరేగింపు కన్నుల పండువగా సాగింది.
శ్రీ రంగం రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
కడపజిల్లా పులివెందులో శ్రీరంగం రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారు సతీసమేతంగా బ్రహ్మ రథంపై కూర్చోని భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేక బృందం ఈ వేడుకలలో పాల్గొంది. స్వామి వారి రథం లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. రథోత్సవం సందర్భంగా కోలాటం, చెక్క భజనల ప్రదర్శనలు భక్తులకు ఆకట్టుకున్నాయి.
కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతిలో కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 4 నుంచి 13వ తేదీ వరకు ఆలయంలో వేడుకలు జరుగనున్నాయి. అంకురార్పణం సందర్భంగా మూషిక వాహనంపై వినాయకస్వామికి ఆస్థానం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 నేపథ్యంలో వాహనసేవలను ఆలయంలో ఏకాంతంగా పూర్తిచేయనున్నారు.
త్రిపురాంతకంలో మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు..
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మహా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులకు ఆదేశించారు. బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానంలో మహా శివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. శివరాత్రి తిరునాళ్లు మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. భక్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు.
కోటివేల్పుల అండ కోటప్పకొండ
మార్చి 11వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో తిరునాళ్లను నిర్వహించనున్నారు. కొండపైన, కింద అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.. పండుగ రోజున శ్రీ త్రికోటేశ్వరస్వామికి అధికసంఖ్యలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేయించుకుంటారు. అన్ని పనులు పూర్తి చేయాలని నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అధికారులను అదేశించారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ఏర్పాట్లు పరిశీలించారు.
శివాలయంలో మహా రుద్రాభిషేకాలు
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయ నాలుగో వార్షికోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే అర్చకులు భక్తి శ్రద్ధలతో హోమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తుల విగ్రహాలను ఊరేగించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని 1001 కలశాలలో జలాలను తీసుకువచ్చి స్వామివారికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ ఆనంద సరస్వతి భక్తులకు స్వామివారి ప్రవచనాలను బోధించారు. స్థానిక మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, ఉత్తరలక్ష్మిలు భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్వామి వారిని రాష్ట్ర మాజీ తెదేపా అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఎచ్చెర్ల నియోజకవర్గం భాజపా అధ్యక్షులు ఈశ్వరరావు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ఏర్పాట్లు పూర్తిచేయండి..!
విజయనగరం జిల్లా పుణ్యగిరి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై అధికారులు సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై.. శాఖల వారీగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కోవిడ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
ఇదీ చూడండి: దుర్గమ్మ చెంతన... అయినవారిదే రాజ్యం!