'కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ ప్రేమ వ్యవహారం కాస్తా.. వారి మధ్య గొడవకు దారితీస్తుంది. వారి పెళ్లి విషయంలో స్వామివారు కొంత ఆలస్యం చేస్తారు. దీంతో అమ్మ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారట. తీనికి ప్రతీకగా.. వీరభద్ర స్వామిని పేడతో చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు.
ఈ విషయం గురించి తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు స్వామిని వెళ్లవద్దని వేడుకొంటారు. స్వామివారు.. భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్తారు. అమ్మవారి భక్తులు ముందుగా వేసుకోన్న ప్రణాళికలో భాగంగా.. వీరభద్ర స్వామి వారిపై పిడకలు విసిరేస్తారు. దీంతో స్వామి వారి భక్తులు ఎదురుదాడికి దిగుతారు. అలా ఇరువర్గాలు పిడకల సమరం సాగిస్తారు. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన భక్తులు.. భద్రకాళి, వీరభద్ర స్వామి వార్ల ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న విభూదిని తీసుకు రావాలని బ్రహ్మ ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కల్యాణం జరిపిస్తామని బ్రహ్మ దేవుడు మాట ఇచ్చారు' అని ఆలయ చరిత్ర చెబుతోంది.
త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్రస్వామి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం, పెళ్లి గొడవే ఈ పిడకల సమరం. అప్పట్లో దేవి, వీరభద్రస్వామి భక్తుల మధ్య జరిగిన పిడకల యుద్ధాన్నే కైరుప్పల ప్రజలు కొనసాగిస్తున్నారు. స్వామి వార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే వారు.. పిడకల సమరం జరిగే ముందు గ్రామంలోని ఓ కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్థులు ఇరువర్గాలగా విడిపోయి పిడకలతో కొట్టుకొంటారు. ఇలా కొట్టుకోవడం ఒక సంప్రదాయం అని భక్తులు అంటున్నారు. పిడకల సమరంలో దెబ్బలతగిలిన వారు ఆలయానికి వెళ్లి స్వామి వార్లకు నమస్కారం చేసుకొంటారు. అక్కడ ఉన్న వీభూతిని దెబ్బలు తగిలిన చోట రాసుకొని ఇళ్లకు వెళ్లిపోతారు. ఈ పిడకల సమరాన్ని చూడటానికి వేలాదిగా జనం తరలివస్తారు. పిడకల సమరం ముగిసిన మరసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు.
ఇదీ చదవండి: ఆట ఆడాలంటే.. డబ్బు కట్టాల్సిందే.. రాష్ట్ర సర్కారు కొత్త రూల్..!