కర్నూలు జిల్లాలో ఇసుక సమస్య పరిష్కారం కాలేదు. భవన నిర్మాణ పనులు ఆగిపోయి చాలా రోజులైంది. ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నా... పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులోకి రాలేదు. దీనివల్ల నిర్మాణాలు... ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ఈ ప్రభావం సాధారణ కూలీలపై పడుతోంది. గ్రామాల నుంచి నిత్యం వందల మంది కూలీలు... పనుల కోసం కర్నూలు నగరానికి చేరుకుంటున్నారు. రోడ్లపై, కూడళ్లలో... పనుల కోసం పడిగాపులు కాస్తున్నారు.
నగరంలోని బిర్లాకూడలి, శరీన్ నగర్, బళ్లారిచౌరస్తా, ఐదు రోడ్ల కూడలి, బండిమెట్ట ప్రాంతాల్లో నిత్యం వందల మంది పనుల కోసం వేచి చూస్తున్నారు. ఆటోలు, బస్సులు, రైళ్లలో వచ్చి... ఈ సెంటర్లలో నిలబడితే... మేస్త్రీలు వచ్చి... అవసరమైన కూలీలను తీసుకువెళ్లి పని కల్పిస్తారు. రోజుకు 300 రూపాయల వరకు వచ్చేది. ఉదయం 8 గంటలకే నగరంలో ప్రత్యక్షమవుతున్నారు. మధ్యాహ్నం వరకు ఎదురుచూసి పని దొరకక... నిరాశగా వెనుదిరుగుతున్నారు.
కర్నూలు నగరానికి పనుల కోసం వచ్చేవారు సుమారు 15 వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరంతా పల్లెల నుంచి 50 నుంచి వంద రూపాయల వరకు ఖర్చు పెట్టుకుని పనికి వస్తే... కనీసం ఛార్జీలు సైతం రావటం లేదని వాపోతున్నారు. ఇసుక సమస్య పరిష్కారమై... నిర్మాణాలు ఊపందుకుంటేనే... తమకు పని దొరుకుతుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: