Nara Lokesh Meeting with Sarpanchs: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాల్లో 24/7 తాగునీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ ప్రకటించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ వద్ద పంచాయతీరాజ్ ప్రతినిధులతో నిర్వహించిన పల్లెప్రగతి కోసం మీ లోకేశ్ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ విధానాన్ని యువనేత ఆవిష్కరింపజేశారు.
గౌరవం పెంచేలా చర్యలు: కార్యక్రమానికి సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు సంధానకర్తగా వ్యవహరించారు. పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తామని, ప్రణాళికాబద్ధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని లోకేశ్ చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను పంచాయతీలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. సర్పంచ్‌లకు గౌరవ వేతనంతోపాటు.. గౌరవం కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ అన్నారు.
నేరుగా పంచాయతీలకే: కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా పంచాయతీలకే జమచేస్తామని చెప్పారు. టీడీపీ పాలనలో ఎన్జీఓలతో కలిసి స్మార్ట్ వార్డు, స్మార్ట్ విలేజీలను చేపట్టామని గుర్తు చేస్తూ.. దాన్ని మరింత అధికంగా చేయాల్సి ఉందని అన్నారు. కేంద్రం సీఎస్ఆర్ నిధులను ఖర్చుపెట్టాలని చెబుతోందని, ఎన్ఆర్ఐ, ఎన్జీఓ, పారిశ్రామికవేత్తల సహకారంతో వీటిన్నింటినీ వాడుకుని గ్రామాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. నదుల అనుసంధానం చేసి.. తద్వారా తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సర్పంచ్ల ప్రశ్నలకు యువనేత స్పష్టమైన సమాధానాలిచ్చారు. అధికార పార్టీ సహా జనసేన, బీజేపీ, సీపీఐ తదితర పార్టీలకు చెందిన సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ప్రత్యేక అభిమానం: నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అయినా రాయలసీమ ప్రాంతంపై ప్రత్యేక అభిమానం ఉండేది. మేం అధికారంలోకి వచ్చాక ఎన్నో చేయాలనుకున్నా కానీ ఫెయిల్ అయ్యాను. ఇంటింటికీ నీటి కుళాయి, ఊరూరా అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ నిర్మాణం చేపట్టాలనుకున్నా.. కానీ వాటిని మిస్ కావడం బాధగా ఉంది. అప్పట్లో జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు ఎన్నో రాయితీలు కల్పించాం. మళ్లీ అధికారంలోకి వచ్చాక సర్పంచ్‌లకు సమాజంలో గౌరవం దక్కేలా విధి విధానాలు రూపొందిస్తాం.
అంబేడ్కర్ రాజ్యాంగం.. రాజారెడ్డి రాజ్యాంగం: ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, వాలంటీర్లు సమష్టిగా గ్రామాభివృద్ధికి కృషి చేసేలా చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు అమలు చేస్తున్నది అంబేడ్కర్ రాజ్యాంగం.. వైఎస్సార్ పార్టీ అమలు చేస్తున్నది రాజారెడ్డి రాజ్యాంగం.. చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ల గౌరవ వేతనాన్ని వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచారు. ఎన్ఆర్ఐలతో కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం. గ్రామాల్లో పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారందరికీ స్థానికంగా అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం.
ఇవీ చదవండి :