కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో నూతన ఓపీడీ భవన నిర్మాణానికి 2017లోనే శ్రీకారం చుట్టారు. అప్పడు రూ.5 కోట్ల నిధులతో నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ పనులు స్లాబు దశ వరకు జరిగి ఆగిపోయింది. ఫలితంగా మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉంది. ఆగిపోయిన భవన నిర్మాణ పనులను వెంటనే పునః ప్రారంభించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు.
300 పడక గదులతో 13 విభాగాల్లో..
మూడొందల పడకలు గల నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో 13 విభాగాలు ఉన్నాయి. రోజు సరాసరి 600 మంది రోగులు ఓపీ తీసుకుని చికిత్స పొందుతారు. ప్రస్తుతం ఇరుగ్గా ఉన్న గదుల్లోనే ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న భవనం పూర్తయితే రద్దీని నివారించి విశాల ప్రాంగణంలో రోగులకు వైద్య సేవలు అందిచవచ్చని సీపీఐ నేత షరీఫ్ , సీపీఎం నేత సద్దాం హుస్సేన్ తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలి..
స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహా ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్యపై దృష్టి ఉంచి నిర్మాణం కొనసాగిస్తే ఓపీడీ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు.
ఇవీ చూడండి : వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద