కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, వరి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. వీటికి తోడు గత కొన్నేళ్లుగా.. మిరప పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం 20 వేల హెక్టార్లు కాగా ఈ ఏడాది.. 24 వేల హెక్టార్ల వరకు సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మిరపకు భారీగా రేటు రావటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.
జిల్లాలోని నందికొట్కూరు, పాణ్యం, డోన్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు నియోజకవర్గాల్లో.. అధికంగా మిర్చిని సాగు చేశారు. నల్లరేగడి నేలలు సహా ఎర్రనేలల్లోనూ మిర్చిని ఎక్కువగా సాగు చేస్తుండటం గమనర్హం. కరోనా కారణంగా.. జిల్లాలో వలసలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో.. గ్రామాల్లోని ప్రజలు వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది క్వింటా మిరప 20 వేలకు పైగా పలికింది. ఊహించని విధంగా రైతుకు లాభాలు వచ్చాయి. చీడపీడలను తట్టుకుని దిగుబడులు బాగా ఇస్తుండటం, లాభాలు సైతం వస్తుండటంతో రైతన్నలు మిర్చి పంట వైపు ఆసక్తి చూపుతున్నారు.
ఎకరం పొలంలో మిరపసాగు చేయటానికి సుమారు 60 నుంచి 80 వేల వరకు ఖర్చు అవుతుంది. తెగుళ్లు రాకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మంచి వర్షాలు కురవటం, కాల్వలు, బావులు, బోరుబావులు, చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో.. ఉద్యాన, వాణిజ్య పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు జిల్లాలో పండించే నాణ్యమైన మిర్చికి విదేశాల్లో సైతం మంచి గిరాకీ ఉండటంతో.. గతేడాది మంచి ధరలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సైతం మంచి దిగుబడులు రావాలని.. నష్టాలు రాకుండా.. మంచి లాభాలు రావాలని రైతులు కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: