తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మట్టి వినాయకుడు నిమజ్జనం అట్టహాసంగా జరుగుతోంది. కర్నూలు నగరంలోని తుంగభద్ర నది ఒడ్డున శ్రీ లక్ష్మీనరసింహ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అరవై ఐదు అడుగుల భారీ మట్టి వినాయకున్ని ఏర్పాటు చేశారు. దీని నిమజ్జనం కార్యక్రమం కోలాహలంగా నిర్వహిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని భక్త మండలి సభ్యులు హోమం, అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అనంతరం లడ్డూ వేలం వేస్తారు. సాయంత్రం నిమజ్జనం చేస్తారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్ సహాయంతో విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేయనున్నారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి ఆలయంలో పదోరోజు నవధాన్య నారికేళ లక్ష్మి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు గణపతి పూజ అనంతరం నారికేళ నవధాన్యాలతో లక్ష్మి పూజ నిర్వహించి దీపార్చన చేశారు. సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు వేద పఠనం చేసి భక్తి గీతాలు ఆలపించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని ఎల్లం కూడలిలో ఏర్పాటు చేసిన మూడు అడుగుల భారీ గణనాథుని నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బల్ల వ్యాసాలు, కోయ నృత్యాలు, నాగిని డాన్స్‌లు, కాంగో డాన్సులు, సాము గరిడీలతో గణపయ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ప్రధాన రహదారి మీదుగా పట్టణ పుర వీధులలో బొజ్జ గణపయ్యని ఊరేగింపుగా తీసుకువెళ్లి నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొనగా ఎలాంటి సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి ప్రసాద్ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.
తూర్పుగోదావరి జిల్లా మండపాలలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న ఆది దేవుని నవరాత్రి మహోత్సవాలు ముగియటంతో బొజ్జ గణపయ్యను పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేసేందుకు భక్తులు తరలి వచ్చారు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చి కేంద్ర పాలిత యానంలో గౌతమీ గోదావరి వరద ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. ప్రభుత్వ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతంలో భారీ క్రేన్ సహాయంతో నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిర్వహించారు. నగరంలో 200 మండపాలలో కొలువైన గణనాథుల ప్రతిమలు భక్తుల చివరి పూజలందుకుని పవిత్ర గోదావరిలో నీటమునిగాయి.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులకు మరియు గ్రామస్తులకు వాదోపవాదాలు జరిగాయి. రాత్రి 7 గంటల సమయం మించి పోవటంతో పాటు కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరగటంతో త్వరగా నిమజ్జనం చేయాలని పోలీసులు ఆదేశించారు. నిమజ్జనానికి అనుమతించాలంటూ రాత్రి 10 గంటల వరకు గ్రామస్తులంతా రోడ్డుపై బైటాయించారు. అన్ని ఊళ్లకి అనుమతించి మా ఊరికి మాత్రం ఎందుకు అనుమతించలేదంటూ గ్రామస్తులు ఆగ్రహించారు.
ఇదీ చూడండి: