Four Arrested in the Case of Theft in Police Station: ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులయ్యారు. ఇంటి దొంగలుగా మారి.. భారీగా వెండి, నగదు కాజేశారు. హాయిగా విలాసాలు చేస్తూ.. జీవితం గడిపారు. తమ సొమ్ము ఇవ్వాలని బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించటంతో.. అసలు విషయం బయట పడింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కర్నూలు వెళ్లాల్సిందే.
భారీ మొత్తంలో వెండి ఆభరణాలు స్వాధీనం: అది 2021 జనవరి 27 రాత్రి.. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య వాహనాలు తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ కారును ఆపి తనిఖీ చేయగా శాతనభారతి, మణికందన్ అనే ఇద్దరు వ్యాపారుల వద్ద 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2.05 లక్షల నగదును గుర్తించారు. వీటికి ఎలాంటి ఆధారపత్రాలు లేకపోవటంతో తనిఖీ అధికారులు సొత్తును సీజ్ చేసి.. అప్పటి కర్నూలు తాలుకా అర్బన్ పోలీసు స్టేషన్ సీఐ విక్రమ్‌సింహాకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న సొత్తును పోలీసు స్టేషన్‌లోని బీరువాలో ఉంచారు. తర్వాత పలువురు సీఐలీ బదిలీ అయ్యారు. 2020 నవంబర్ వరకూ.. వెండికి సంబంధించిన వ్యాపారులు స్టేషన్‌కు రాలేదు.
పోలీసులకు షాక్: ఈ ఏడాది మార్చి 27న వెండి యజమానులైన వ్యాపారులు శాతనభారతి, మణికందన్ న్యాయస్థానం నుంచి అనుమతి పొంది.. కర్నూలు తాలుకా అర్బన్ స్టేషన్‌కు వచ్చి సొత్తు అప్పగించమని అడిగారు. బీరువా తెరిచి చూసే సరికి పోలీసులు కంగుతిన్నారు. అసలు బీరువాలో సొత్తు లేకపోవటంతో నిర్ఘాంతపోయారు.
పక్కా ప్లాన్: పోలీస్ స్టేషన్లోనే.. వెండి, నగదు మాయం కావటంతో.. కేసు నమోదు చేసి.. పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు తాలుకా అర్బన్ సీఐగా శేషయ్య ఉన్న సమయంలో.. హెడ్ కానిస్టేబుల్‌గా అమరావతి, కానిస్టేబుల్ రమణబాబు స్టేషన్‌లో కీలకంగా వ్యవహరించేవారు. బీరువాలో ఉంచిన సొత్తుపై కన్నేసిన అమరావతి.. పలుమార్లు వ్యాపారులకు ఫోన్ చేసి తీసుకెళ్లాలని చెప్పగా వారు నిరాకరించారు.
దీంతో వారికి వెండి తీసుకెళ్లే ఉద్దేశం లేదని, వాటిని తీసుకెళ్లి సొమ్ము చేసుకోవాలన్న దురాలోచన కలిగింది. రమణబాబుతో తన ఆలోచనను చెప్పగా అతను చేతులు కలిపాడు. వాటాలపై నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్‌లో సీజ్ చేసిన మద్యాన్ని ధ్వంసం చేసేందుతు 2022 జూన్‌లో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. జప్తు చేసిన మద్యం బాటిళ్లను స్టేషన్ బయటపెట్టారు. అదే అదనుగా చేసుకుని నిందితుల వెండి ఆభరణాల బస్తాలను బయటకు తరలించారు.
దోచుకున్న వాటితో ఆస్తులు కొనుగోలు: అమరావతి భర్త విజయ భాస్కర్ ఆటోలో రావటంతో వెండిని అందులో ఎక్కించారు. వాటాలు పంచుకున్న ఇద్దరు పోలీసులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. సెబ్ అధికారులు సొత్తును అప్పగించే సందర్భంలో వివరాలు నమోదు చేసేందుకు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన దస్త్రాన్ని కూడా మాయం చేశారు. వచ్చిన డబ్బుతో అమరావతి 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల కారు, ఓ ఇంటి స్థలం కొనుగోలు చేయగా, రమణబాబు పంచలింగాల పరిధిలో 12 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు.
చివరికి పట్టుబడ్డారు ఇలా: ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. అనుమానితుల కోసం గాలించారు. నిందితులు కర్నాటకకు పారిపోతుండగా.. హెడ్ కానిస్టేబుల్ అమరావతి, రైటర్ రమణ సహా వీరికి సహకరించిన అమరావతి భర్త విజయ్ భాస్కర్, బంగారు దుకాణం యజమాని భరత్ సింహాలను అరెస్టు చేశారు. వీరి నుంచి 10 లక్షల నగదు, 81.52 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: