KMC wasting public money: ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నుల డబ్బులను వృథా చేస్తున్నారు. కోట్లాది రూపాయలు రోడ్డుపాలు చేస్తున్నారు. ఎందుకు ఖర్చు చేస్తున్నారో, ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు కానీ.. కర్నూలు నగరంలో ఉన్నవి పడగొట్టటం, మళ్లీ కట్టటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వృథా ఖర్చులే అధికం.. కర్నూలు నగరపాలక సంస్థ పాలక మండలి ఏర్పాటైన తర్వాత ప్రజా ధనాన్ని.. మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. నగరంలోని ఎన్నో ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, వీధిలైట్లు, మంచి నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ ప్రాంతానికి వసతులు కల్పించాలని అధికారుల చుట్టూ, ప్రజా ప్రతినిధుల చుట్టూ నగర ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. అవేవీ పట్టని సంస్థ.. ఆధునీకరణ పేరుతో ఇష్టా రాజ్యంగా పనులు చేపడుతోంది. ఎస్ బీఐ కూడలిలో.. వైఎస్ విగ్రహం చుట్టూ ఉన్న నిర్మాణాలు తొలగించి.. మళ్లీ కొత్తగా నిర్మిస్తున్నారు. రాజ్ విహార్ కూడలి నుంచి హంద్రీ బ్రిడ్జి వరకు డివైడర్ మధ్యలో ఉన్న మట్టిని తొలగించి.. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. నంద్యాల చెక్ పోస్టు వైపు వెళ్లే మార్గంలో డివైడర్ మధ్యలోని మొక్కలు సహా మట్టిని తొలగించి మళ్లీ కొత్తగా మట్టిని నింపుతున్నారు. గుత్తి పెట్రోల్ పంప్ కూడలిలో కొత్తగా గ్లోబ్ ను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల డివైడర్లకు ఇరువైపులా వేసిన రంగులు, డిజైన్లు మళ్లీ, మళ్లీ వేస్తున్నారు. దీనిపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కమీషన్ల కోసమేనా.. ప్రకాష్ నగర్, మెడికల్ కళాశాల తదితర ప్రాంతాల్లో ఉన్న బష్ షెల్టర్లను తొలగిస్తున్నారు. గాయిత్రీ ఎస్టేట్ కూడలిలో ఉన్న పచ్చదనాన్ని తొలగించి.. కరోనా సింబల్ ను ఏర్పాటు చేశారు. ఈ రెండేళ్ల వ్యవధిలో వీటన్నింటికీ.. 12 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. కేవలం కమీషన్ల కోసమే ఈ విధంగా చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి పన్ను భారీగా పెంచేసి ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ ఆ డబ్బులను ఈ విధంగా వృథా చేయటం ఏమిటని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.
కనీస వసతులు పట్టించుకోరే.. నగరంలో చాలా చోట్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. డ్రైనేజీల నిర్వహణ బాగా లేక దోమలు పెరిగిపోతున్నాయి. చాలా ప్రాంతాలకు మంచినీటి సరఫరా లేదు. కొన్ని కాలనీల్లో సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి గురించి కనీసం పట్టించుకోని నగరపాలక సంస్థ పాలక మండలి.. డబ్బులు వృథా చేయటాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.