కర్నూలు డిప్యూటీ మేయర్ పదవికి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. ఓ విద్యాసంస్థల అధినేత కుమార్తె ఈ పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 36వ వార్డులో గెలిచిన కార్పొరేటర్ రేణుక పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా గురువారం జరిగే ఎన్నిక సమయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బీసీ, మైనార్టీ, ఎస్సీలకు పెద్దపీట
పురపాలక పదవుల్లో సామాజిక సమతుల్యత దాటి బీసీలకు పెద్దపీట వేసినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మైనార్టీ, ఎస్సీలకు నిజమైన సాధికారత కల్పించామన్నారు. కర్నూలు మేయర్ పదవి బీసీ సామాజిక వర్గానికి చెందిన బీవై రామయ్యకు కేటాయించారు. అలాగే ఆదోనిలో బీసీ మహిళకు రిజర్వేషన్ అవగా నలుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. ఇందులో 28వ వార్డులో గెలిచిన బోయ శాంత పేరు వినిపిస్తోంది. ఉప ఛైర్మన్‌గా 11వ వార్డులో గెలిచిన ముల్లా మహ్మద్‌గౌస్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆత్మకూరులో మైనార్టీ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. ఎమ్మిగనూరు మున్సిపాల్టీ బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో డాక్టర్ రఘును ఛైర్మన్‌గా నేడు ప్రకటించనున్నారు.
ముందే ప్రకటించకుండా..
చీటీలో ఒక పేరు రాసి ఎవరినైతే పార్టీ ఎంపిక చేసిందో ఆ అభ్యర్థుల చేతికి ఇస్తారు. ఎన్నిక ప్రారంభం కాగానే చీటిలో పేరు వచ్చిన వ్యక్తి నేను నిలబడుతున్నా అని ప్రకటిస్తారు. మిగిలిన వైకాపా అభ్యర్థులంతా అతనికే మద్దతు తెలిపి ఎన్నుకోవాలి. ఇదీ శిల్పా కుటుంబం గత కొన్నేళ్లుగా పాటిస్తున్న సంప్రదాయం. 2005లో మున్సిపల్ ఛైర్మన్‌గా కైపా రాముడు, 2014లో దేశం సులోచనకు సంబంధించి ఇదే ఫార్ములా పాటించారు. ప్రస్తుతం నంద్యాల ఛైర్మన్ పదవి మైనార్టీలకు ఇస్తామని ఇప్పటికే శిల్పా కుటుంబం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 29వ వార్డులో గెలిచిన అభ్యర్థిని షేక్ మాబున్నీ పేరు తెరపైకి వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా రెండున్నర ఏళ్లు గంగిశెట్టి శ్రీధర్‌కు, మిగిలిన రెండున్నరేళ్లు బలిజ సామాజిక వర్గానికి కేటాయిస్తామని ప్రకటించిన విషయం విదితమే.
సీల్డు కవరులోనే భవితవ్యం
ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లు నియోజకవర్గ ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు వెళ్లాక అధిష్ఠానం సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపికైన వారి పేర్లు సీల్డు కవరులో అందుతున్నాయి. కొన్ని మున్సిపాల్టీలకు గురువారం ఎన్నిక సమయానికి అందే అవకాశం ఉంది. ఇందులో పేర్లు ఉన్నవారికే పట్టం కట్టనున్నారు. నందికొట్కూరులో ఛైర్మన్ రేసులో సుధాకర్‌రెడ్డి, జాకీర్ హుస్సేన్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారనేది ఇంకా సీల్డు కవర్ అందలేదని నాయకులు చెబుతున్నారు.
శిబిరానికి తరలిన వైకాపా కౌన్సిలర్లు
గూడూరు నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇందులో అందులో వైకాపా 12 స్థానాలను సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 3, భాజపా 1, స్వతంత్రులు నలుగురు మిగిలిన వార్డులు గెలుచుకున్నారు. అయితే తెదేపా, భాజపా, స్వతంత్రులు ఒక్కటై అధికార పార్టీ నుంచి కౌన్సిలర్లను రప్పించి ఛైర్మన్‌కు ఓటేసేలా పావులు కదిపారు. పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతుండటంతో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పసిగట్టారు. ఈ క్రమంలో ముందస్తుగా వైకాపా తరఫున గెలిచిన 12 మంది కౌన్సిలర్లను కర్నూలులోని శిబిరానికి తరలించారు. వీరంతా ఒకేసారి కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శిబిరంలో అందరూ కలిసి విజయం మాదే అంటూ దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఇదీ చదవండి: నగర, పురపాలికల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు