ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నీటిని తోడేస్తున్న అంశంపై లేఖలు రాస్తున్నా.. ఏ మాత్రం పట్టించకోకపోవడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డును నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్తో పాటు ఇతర అంశాలపై జరుగనున్న 2 బోర్డుల సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికీ తెలంగాణా అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ఆపకపోవటం- బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవటంపై ప్రశ్నించాలని భావిస్తోంది.
కీలకాంశాలపై చర్చ..
మరోవైపు బోర్డుల సమావేశంలో కేఆర్ఎంబీ పరిధి, సిబ్బంది కేటాయింపు, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విశాఖ తరలింపు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు రెండు రాష్ట్రా ప్రభుత్వాలు పది కోట్ల రూపాయల చోప్పున డిపాజిట్ చేయాలని కేంద్రం గెజిట్ లో పేర్కొంది. దీంతో పాటు ఆయా బోర్డులు కూడా ఏపీకి లేఖలు రాశాయి. మరోవైపు సిబ్బంది కేటాయింపు కృష్ణా, గోదావరి నదుల్లో నీటి కేటాయింపులు, వాటాలపై కీలకంగా చర్చ జరుగనుంది. వరద నీటి వినియోగం, పంపకాలపై కూడా చర్చించాలని అజెండాలో పేర్కొన్నారు.
పరిధిపై విజ్ఞప్తి...!
ఈ భేటీలో కృష్ణా - గోదావరి నదులపై చేపడుతున్న కొత్త ప్రాజెక్ట్ లపై చర్చించనున్నారు. తెలంగాణలో నిర్మిస్తున్న చిన్నతరహా ప్రాజెక్టులు.. వీటి నిర్మాణం కోసం 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ 474 జీవోలు జారీ చేసిన అంశాన్ని కూడా చర్చించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలింపు అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న కొన్ని అంశాలపై అభ్యంతరాలను ఏపీ లేవనెత్తనుంది. ఏపీ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, కాలువలను బోర్డుల పరిధి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్టు తెలుస్తోంది.
వెలిగొండ ప్రాజెక్టును గుర్తించాలి..!
వెలిగొండ ప్రాజెక్టుకు గెజిట్లో అనుమతి కలిగిన ప్రాజెక్టుగా సవరించాలని ఏపీ డిమాండ్ చేయనుంది. బ్యారేజీలు, కాలువల నిర్వహణను బోర్డు పరిధిలో ఉంటే ఎదురయ్యే ఇబ్బందుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించనుంది. దిగువ రాష్ట్రంగా సహజ న్యాయసూత్రాల ప్రకారం నీటిపై పూర్తి హక్కులు ఏపీకి ఉంటాయని వాదనలు వినిపించనున్నారు. కృష్ణా జలాల్లో జలవివాదాల ట్రైబ్యునల్ 2 అవార్డు వచ్చేంత వరకూ 70-30 నిష్పత్తిలోనే ఏపీ , తెలంగాణాలకు నీటి పంపకాలు జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. నీటి వాటాల్లో 50 - 50 నిష్పత్తిలో పంపకాలు చేయాలంటూ తెలంగాణా డిమాండ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు. మరోవైపు శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతి తో పాటు సాగునీటి అవసరాల కోసం ఏపీ ఇండెంట్ ఉంటేనే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పించాలని ఏపీ కోరనుంది. తెలంగాణా రాష్ట్రానికి ఈ రెండు ప్రాజెక్టుల దిగువన తాగు, సాగునీటి అవసరాలేమీ లేవని స్పష్టం చేయనున్నారు.
ఇదీ చదవండి:
Minister Gowtham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి