హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని.. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని పెసరవాయి గ్రామంలో గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకుల హత్యకు తనకు సంబంధం లేదని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని... తన ప్రమేయం ఉందని తేలితే... ఎలాంటి శిక్ష విధించిన సమ్మతమేనని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ హత్యలపై మాట్లాడిన తీరు సరిగాలేదన్నారు కాటసాని. హత్యకు గురైన వ్యక్తులపై పలు కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ హత్యలపై ఎలాంటి దర్యాప్తు సంస్థలతో అయినా విచారణ జరిపి తన ప్రమేయంపై నిగ్గుతేల్చాలన్నారు. చనిపోయిన వ్యక్తులు తమతో చాలాసార్లు వారి గ్రామానికి సంబంధించిన విషయాలపై ఫోన్లో మాట్లాడారని కాటసాని తెలిపారు.
ఏం జరిగింది..?
పెసరవాయి గ్రామంలో తెదేపా నాయకుడు.. మాజీ సర్పంచి వడ్డు నాగేశ్వరరెడ్డి (58), సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, జిల్లా సహకార సంఘం మాజీ డైరెక్టరు వడ్డు ప్రతాపరెడ్డి (56) గురువారం ఉదయం ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురవడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికలు ఏకగ్రీవమవగా.. సర్పంచి ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. ఎన్నికల రోజున దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వారిని ప్రతాపరెడ్డి అడ్డుకోవడంతో ప్రత్యర్థులు దాడి చేసి కొట్టారు. అప్పటినుంచి గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో మృతుల చిన్నాన్న కుమారుడు మోహన్‌రెడ్డి మంగళవారం చనిపోగా చిన్నకర్మలో పాల్గొనేందుకు వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డి, కుటుంబసభ్యులు శ్మశానవాటికకు పయనమయ్యారు. దీనిని గ్రహించిన ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి చనిపోగా వడ్డు వెంకటేశ్వరరెడ్డి, వడ్డు సుబ్బారెడ్డి, వడ్డు వెంకటేశ్వరరెడ్డి గాయపడ్డారు. కారులో వచ్చిన నిందితులు వేటకొడవళ్లు, గొడ్డలి, కత్తితో నరికి చంపారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
లోకేశ్ ఏమన్నారంటే..
'నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిని వాహనంతో ఢీకొట్టించి దారుణంగా హతమార్చారు. తెదేపా కార్యకర్తలను బెదిరించి, నాయకులను చంపితే మేం వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా?మిమ్మల్ని వదిలిపెట్టం. మా కార్యకర్తలను భయపెడితే పార్టీకి నష్టం తేవచ్చని మీరు అనుకుంటున్నారు. అలా అనుకోవడం చాలా పొరపాటు. మేం మీకు భయపడి పారిపోయేవాళ్లం కాదు. మీకు చేతకాకే మా కార్యకర్తలు, నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. మా ఓపికను పరీక్షించొద్దు.. బీ కేర్‌ఫుల్. సమయం వస్తుంది.. అప్పుడు నేతలు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులకు గుణపాఠం చెప్పే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెదేపా కార్యకర్తలకు హామీ ఇస్తున్నా'
ఇదీ చదవండీ... కర్నూలు జిల్లాలో ఇద్దరు తెదేపా నాయకుల దారుణ హత్య..!