ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈవీఎంలు, వీవీ ప్యాట్లకు.. స్ట్రాంగ్ రూముల్లో అధికారులు కల్పిస్తున్న భద్రతపై పార్టీల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు పుల్లయ్య కళాశాలలో భద్రపరిచారు. నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు రాయలసీమ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. ఈ నెల 11న ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు.. 12 న మధ్యాహ్నంలోగా... ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్‌రూములకు చేర్చారు.
స్ట్రాంగ్‌రూంల వద్ద అధికారులు మూడంచెల భద్రత కల్పించారు. కేంద్ర పారామిలటరీ బలగాలు, ఏపీఎస్పీ పోలీసులు, సివిల్ పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. 24 గంటలూ పహారా కాస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... రాయలసీమ వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంల వద్ద సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. మొత్తం 60 కెమెరాలు ఉండగా... వీటిలో సగమే పనిచేస్తున్నాయి. మిగిలిన కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి.
4 రోజుల తర్వాత మేల్కొన్న అధికారులు హడావుడిగా... కొత్త కెమెరాలు అమర్చే పనిలో పడ్డారు. ఈ విషయమై ''ఈనాడు - ఈటీవి భారత్'' ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించగా... అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయని సమాధానం చెప్పారు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్క రాయలసీమ విశ్వవిద్యాలయంలోనే ఈ పరిస్థితి ఉందా... లేదంటే అన్ని కేంద్రాల దగ్గరా ఇలాంటి నిర్లక్ష్యమే చూపిస్తున్నారా... అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈవీఎంలకు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి