కర్నూలు జిల్లా బనగానపల్లెకు సమీపంలో ఉన్న రవ్వలకొండకు చారిత్రకంగా ప్రాధాన్యత ఉంది. అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ ప్రాంతంలోనే పశువులను మేపేవారు. రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారని చరిత్ర చెబుతోంది. అక్కడ గుహలో బ్రహ్మంగారు, అచ్చమాంబ విగ్రహాలున్నాయి. బ్రహ్మంగారి విగ్రహానికి స్థానికులు ఇక్కడ నిత్యం పూజలు చేస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యటకులు ఇక్కడికు అధికంగా వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో మైనింగ్‌తో పర్యటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిధి దాటి మైనింగ్ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సర్వే నంబర్ 313 లో 21 ఎకరాల ప్రభుత్వ, 11 ఎకరాల అటవీశాఖ భూముల్లో మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 10 చోట్ల మెటల్ తవ్వకాలు జరుగుతున్నాయి. దీని కోసం పరిధి దాటి ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతూ ఏకంగా రవ్వలకొండనే తవ్వేస్తున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైనింగ్‌కు అధికార అండ
గతంలో తవ్వకాల కారణంగా రవ్వలకొండ గుహలో పగుళ్లు వచ్చిన ఆనవాళ్లున్నాయి. ఏకంగా కొండపైనే డంప్ ఏర్పాటు చేసుకోవటం సహా వాహనాలను సైతం అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. కొండను తవ్వటం, పేలుళ్లు జరపడం ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు గుహ కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కొండకు 300 మీటర్ల లోపు మైనింగ్ చేయకూడదనే నిబంధనలున్నా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవటంతో కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన రవ్వలకొండను కాపాడాల్సిన అవసరం ఉందని భక్తులు అంటున్నారు.