కర్నూలు జిల్లా హోళగుంద మండలానికి చెందిన మిక్కిలినేని జీవన్ కుమార్... బీఎఫ్ఏ యానిమేషన్ కోర్సు పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్లో కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశాడు. అరకొర జీతాలతో నాలుగు గోడల మధ్య చేసే ఉద్యోగం నచ్చక ఇంటికి చేరాడు. తన గ్రామంలో పొలం పనులు చూసుకుంటూ పాడి పరిశ్రమ వైపు దృష్టి పెట్టాడు. ముందుగా... 8 గేదెలను కొనుగోలు చేసి కార్యాచరణ ప్రారంభించాడు. ఒక్కో దానికి లక్ష రూపాయల వరకు వెచ్చించి హర్యానా నుంచి గెదెలు తీసుకొచ్చాడు.
స్థానిక మండల కేంద్రానికి ఉదయం ఐదున్నర గంటలకే చిక్కటిపాలు అందిస్తున్నాడు. త్వరలోనే మరో 8 బర్రెలను తీసుకువచ్చి వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నాడు జీవన్. పదిమందికి ఉపాధిని కల్పిస్తూ తాను అభివృద్ధి కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని ముందుకి వెళుతున్నాడు. సొంత బ్రాండ్ ద్వారా మార్కెట్లో పాల విక్రయం చేపడతామని చెప్తున్నాడు. పర్యావరణ హితానికి ప్లాస్టిక్ కాకుండా గాజు సీసాల ద్వారా పాలను అందిస్తున్నామని జీవన్ కుమార్ తెలిపాడు. స్వశక్తితో శ్రమిస్తే.. సాధించలేనిది లేదని నిరూపిస్తున్నాడు.. ఈ యువకుడు.