పార్వతిది కర్నూలు జిల్లా లక్కసాగరం. అమ్మా నాన్నా మీనాక్షమ్మ, శ్రీనివాసులు కూలీలు. నాలుగు ఎకరాలున్నా కరవు వల్ల పంటలు కష్టం. ఇద్దరు అన్నలు, ఒక అక్క. ఇంటరయ్యాక నర్సింగ్ చేస్తే ఇంటికి కాస్త ఆధారంగా ఉంటుందని అమ్మానాన్నా ఆలోచన. కానీ తనకేమో సంగీతమంటే ప్రాణం. అదే విషయం ఇంట్లో చెప్పింది. పెద్దన్న చంద్ర మోహన్ మద్దతుతో తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో డిప్లొమాలో చేరింది.
చిన్నప్పటి నుంచీ స్కూలు, కళాశాలల్లో పాటల పోటీల్లో పాల్గొనేది. కర్నూలులో ఓ పోటీలో పాల్గొన్నప్పుడు న్యాయనిర్ణేతలకు తన గొంతు బాగా నచ్చింది, శాస్త్రీయ సంగీతం నేర్చుకోమని సలహా ఇచ్చారు. అలా దానిపై దృష్టి పెట్టింది. తిరుపతిలో ప్రిన్సిపల్ సుధాకర్, గురువు వల్లూరి సురేష్ బాబు వద్ద శిక్షణ తీసుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ ‘అదిగో అల్లదివో’ కార్యక్రమానికీ ఎంపికైంది. అన్నమయ్య కీర్తన ‘ఏమీ చేయవచ్చునే’తో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘జీ-సరిగమప’లో అవకాశం దక్కించుకుంది. దీన్లోనే ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ పాట పాడింది. తన గొంతు విని అబ్బురపడ్డ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆమెకు ఏం కావాలన్నా నెరవేరుస్తా అన్నారు. తను మాత్రం మా ఊరికి బస్సు కావాలంది.
తనలా మరొకరు ఇబ్బంది పడొద్దనీ..
లక్కవరం పిల్లలు హైస్కూలు కోసం 10కి.మీ.కు పైగా ప్రయాణించాలి. కళాశాలంటే 25 కి.మీ. దూరంలోని డోన్ వెళ్లాలి. ఆ రోడ్లు అధ్వానంగా ఉండటంతో బస్సులు తిరగవు. ఆ దారిలో ప్రయాణించే వారిని సాయమడిగి వెళ్లే వాళ్లే ఎక్కువ. పార్వతి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంటర్ చదివింది. అయితే తనను అన్నయ్యలు తీసుకెళ్లే వాళ్లు. తిరుపతిలో చదివేటప్పుడు.. సమయానికి రైలు అందుకోలేక ఇబ్బందిపడ్డ సందర్భాలెన్నో. ఒక్కోసారి రైల్వే స్టేషన్‌లోనే పడుకొని మరుసటి రోజు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే తను పడ్డ కష్టం, మరే విద్యార్థీ పడొద్దని ఈ కోరికను కోరింది. ఈ వీడియోను యూట్యూబ్‌లో ఉంచగా వైరలైంది. రెండు రోజుల్లోనే 4 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇది ఆ నోటా ఈనోటా ఏపీ రవాణా మంత్రి దాకా చేరింది. ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పార్వతి కోరిక మేరకు వెంటనే బస్సు సర్వీసులు నడపడం ప్రారంభించారు. ఆమె నలుగురి గురించీ ఆలోచించిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఈమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పార్వతి భవిష్యత్‌లో మంచి గాయనిగా ఎదగాలని ఆశ పడుతోంది. కర్నూలులో సంగీత కళాశాల స్థాపించడం, పేద విద్యార్థులకు శిక్షణనివ్వడం లక్ష్యాలని చెబుతోంది.
ఇదీ చదవండి :
Woman Code to Win Contest: సవాళ్లతో సావాసం.. అదే ఆమె విజయ మంత్రం