కర్నూలు, కడప జిల్లాల్లో ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన గోరుకల్లు జలాశయ లక్ష్యం నీరుగారుతోంది. ప్రాజెక్టులో శ్రీశైలం నీటిని నింపుతున్నా.. నీరు నిలవని పరిస్థితి. గోరుకల్లు కరకట్ట, గేట్ల పనులతోపాటు, జలాశయాన్ని ఆనుకొని ప్రారంభమవుతున్న గాలేరు - నగరి సుజల స్రవంతి పథకంలో ప్యాకేజీ 27లో రెండుచోట్ల గేట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా గతేడాది వరదల సమయంలో గోరుకల్లులో 8.16 టీఎంసీలు నింపామని అధికారులు తృప్తి చెందినా, జీఎన్‌ఎస్‌ఎస్ గేట్లు లేక దిగువకు నీళ్లు పోవడం వల్ల ప్రస్తుతం 5.5 టీఎంసీల నీరే మిగిలింది.
- పెరుగుతున్న వ్యయం
1993లో రూ.448.2 కోట్ల అంచనాలతో శంకుస్థాపన జరిగిన గోరుకల్లు ప్రాజెక్టును ఎట్టకేలకు 2016 ఆగస్టులో పూర్తి చేసి 3.35 టీఎంసీల నీటిని నింపారు. ప్రారంభంలోనే లీకేజీలతో నాణ్యత వెక్కిరించింది. నిపుణుల కమిటీ సూచన మేరకు ప్రభుత్వం 2017 జూన్‌లో సుమారు రూ.45 కోట్లు విడుదల చేయగా, జలాశయం పనులు చేపట్టిన గుత్తేదారునికే నామినేషన్‌పై ఈ పనులు సైతం అప్పగించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.500 కోట్లకు చేరింది. కరకట్ట ఎత్తు 4.6 మీటర్లు పెంచే పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఇంకా ఏర్పాటు చేయలేదు. ఓటీ రెగ్యులేటర్ వద్ద, డిప్లిషన్ వద్ద ఎమర్జెన్సీ గేట్లు ఏర్పాటు చేసినా చైన్‌పుల్లీతో ఆపరేట్ చేస్తున్నారు. మోటార్ల ద్వారా గేట్లు ఎత్తేలా చేయాల్సి ఉంది. వీటన్నింటినీ పూర్తి చేసేసరికి ప్రాజెక్టు వ్యయం రూ.542 కోట్లకు చేరే అవకాశాలున్నాయి.
- పాత గుత్తేదార్లను రద్దు చేసి..
గుత్తేదార్లు కొన్నేళ్ల క్రితం దక్కించుకున్న పనులు కావడంతో అప్పటి ధరలు ప్రస్తుతం గిట్టుబాటు కాకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. పైగా లాక్‌డౌన్ నేపథ్యంలో కూలీల కొరత కొంత ప్రభావం చూపింది. రాష్ట్రంలో ఇలా చివరి దశలో నత్తనడకన సాగుతున్న 198 పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం 635 జీవోను విడుదల చేసింది. ఈ పనుల్లో గోరుకల్లు జలాశయం కూడా ఉండటం గమనార్హం. దీంతో గోరుకల్లులో మిగిలిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి కొత్త గుత్తేదార్లకు అప్పగించాల్సి ఉంది.
- నీరుగారుతున్న లక్ష్యం
శ్రీశైలం వెనుక జలాలు గోరుకల్లు బైపాస్ కెనాల్ ద్వారా 2,400 క్యూసెక్కులు చొప్పున కర్నూలు, కడప జిల్లాల్లో 16 బ్లాక్‌ల వరకు ఇస్తారు. గోరుకల్లు జలాశయాన్ని పూర్తి స్థాయి నీటిమట్టం 12.44 టీఎంసీలతో నింపిన తర్వాత పోతిరెడ్డిపాడు వద్ద శ్రీశైలం జలాలు రావడం ఆగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లిచ్చి ఆయకట్టు స్థిరీకరణ జరిగేలా చూడాలన్నది లక్ష్యం. గోరుకల్లు జలాశయం ఆనుకొని ఉన్న జీఎన్‌ఎస్‌ఎస్ (ప్యాకేజీ 27)లో ఒకచోట నాలుగు, మరోచోట ఆరు గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులు నత్తనడకన సాగుతుండటంతో గోరుకల్లు ప్రాజెక్టులో ఎంత నీరు నింపినా, స్పిల్ లెవల్ 5.6 టీఎంసీలు తప్ప మిగిలిన నీరంతా బయటకు వెళ్లిపోతోంది.
ఇదీ చదవండి :