కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి 2005 నుంచి ఆసుపత్రిలో ప్రతిరోజు రాత్రి రోగితో పాటు మరొకరికి అన్నదానం చేస్తూ వస్తున్నారు. కాగా...అన్నదానాన్ని ఆపాలని వైకాపాకు చెందిన నలుగురు కార్యకర్తలు బెదిరించారని వంటమనిషి కిష్టన్న ఆరోపించారు. ఇది తెలుసుకున్నబీసీ జనార్దన్ రెడ్డి,అతని సోదరుడు రాజారెడ్డి ఆస్పత్రి ఆవరణలో ఉన్న అన్నదాన కేంద్రం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వైపు వైకాపా కార్యకర్తలు మరోవైపు తెదేపా కార్యకర్తలు అక్కడికి రావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
విషయం తెలుసుకున్న పోలీసులు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బెదిరిపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2005 నుంచి ఇప్పటివరకు నిత్యం అన్నదానం చేస్తున్నామని ఇప్పుడు వైకాపా కార్యకర్తలు ఇబ్బందులకు గురిచేయటం మంచిది కాదన్నారు. జోక్య చేసుకున్న ఆసుపత్రి సూపరిండెంట్ ఈ నెల 31 వరకు అన్నదానం నిలిపివేయాలని తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది...కాగా బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...బీసీ జనార్దన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.