భూమిని నమ్ముకున్న రైతు దంపతులు వ్యవసాయం కలిసిరాక అప్పులపాలయ్యారు. వాటిని తీర్చే మార్గం కానరక చావే శరణ్యమని తలచారు. ఫిబ్రవరి 7 భార్య ఆత్మహత్య చేసుకోగా.... గురువారం భర్త బలవన్మరణం పొందిన విషాద ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన అంబటి సంజీవరెడ్డికి (30) వ్యవసాయమే జీవనాధారం. ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రావణితో వివాహమైంది. వీరికి తేజస్విని (5), అశ్విని (3) సాయి తేజస్విని (4 నెలలు) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
భార్యభర్తలిద్దరు పొలాలను కౌలుకు తీసుకుని పంటలు వేసేవారు. నష్టాలు వస్తున్న.... ఏదో ఒక రోజు గట్టేక్కుతామనే ధీమాతో ఉండేవారు. ఈ సంవత్సరం ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని ముందుగానే కౌలు ఇచ్చి పత్తి పంటను సాగు చేశాడు. వాతావరణం సరిగా అనుకూలించకపోవడంతో పంట దిగుబడి రాక తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయం కోసం రూ.11 లక్షలు అప్పు చేశాడు. ఈ అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో గత నెల ఏడవ తేదీన అతని భార్య శ్రావణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తీవ్ర ఆవేదన గురైన సంజీవరెడ్డి కుమిలిపోయే వాడు. గురువారం మిద్దె పైకి వెళ్లి పురుగుల మందు తాగి, కిందకు వచ్చి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశానని తల్లి వెంకటలక్ష్మితో చెప్పాడు. కుమారుడిని కాపాడుకునేందుకు తల్లి ఆటోలో ఆళ్లగడ్డకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. భార్యభర్తలు మృతి చెందటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారి భవిష్యత్‌ను తలచుకుని బంధువులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి