ఈనెల 20న కర్నూలు జిల్లావ్యాప్తంగా 1,178 కరోనా కేసులు నమోదవగా.. అందులో గ్రామీణ ప్రాంతాల్లోనే 831 కేసులు ఉండటం గమనార్హం. గడివేముల మండలంలో 69, బనగానపల్లి 44, కోవెలకుంట్ల 43, ఉయ్యాలవాడ మండలంలో 38 మంది వైరస్ బారిన పడ్డారు. మిగతా మండలాల్లో 10 నుంచి 20 వరకు కేసులు వచ్చాయి.
- ఈనెల 22న జిల్లాలో 1,161 మంది వైరస్ బారిన పడినట్లు నివేదిక వచ్చింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 801 మందికి కరోనా సోకగా.. పట్టణ ప్రాంతాల్లో 360 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎక్కువగా సంజామల మండలంలో 49, ఆత్మకూరు గ్రామీణ 81, గడివేముల 45, జూపాడుబంగ్లా మండలంలో 36 కేసులు నమోదయ్యాయి.
- జిల్లాలో కరోనా మొదటి వేవ్ నుంచి ఈనెల 22వ తేదీ వరకు పరిశీలించగా 1,06,812 మందికి కొవిడ్ సోకింది. ఈ మొత్తం కేసులను పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలవారు 52,413 మంది, పట్టణ ప్రాంతాలవారు 54,399 మంది వైరస్ బారిన పడ్డారు. గతేడాది ఎక్కువగా పట్టణ ప్రాంతాలవారికి వైరస్ సోకగా.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
- జిల్లాలో ఎక్కడా కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించలేదు. కనీసం హైపో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న దాఖలాలు లేవు. గతేడాది వీటన్నింటినీ పకడ్బందీగా నిర్వహించినా ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడం లేదు.
జిల్లావ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 1,06,812 మంది వైరస్ ప్రభావానికి గురయ్యాయి. కొవిడ్ మొదటి వేవ్‌లో ఎక్కువగా పట్టణ ప్రాంత ప్రజలు కరోనా బారిన పడగా గ్రామాల్లో తక్కువ కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం సగానికిపైగా బాధితులు పల్లె ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. ఏప్రిల్, మే నెలల్లో కలిపి 42,872 మందికి కొవిడ్ సోకగా అందులో సుమారు 20 వేలకుపైగా కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.
వేధిస్తున్న బ్లాక్ ఫంగస్:
గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది జ్వరాలు వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యుల వద్దకు వెళుతున్నారు. వారు ఇష్టానుసారంగా మందులు ఇవ్వడం.. జ్వరం తగ్గడంతో జనం తమ పనుల్లో మునిగిపోతున్నారు. వైరస్‌ను గుర్తించకపోవడం.. ఇతరులను కలుస్తుండటంతో వారి ద్వారా వేలాది మందిపై ప్రభావం పడుతోంది. ఫలితంగా పలువురు ఊపిరి ఆడని సమస్యలతో ప్రాణాలు సైతం వదులుతున్నారు. కరోనాకు భయపడి చాలామంది పరీక్షలకు వెనకడుగు వేస్తుండటం, అవగాహన లేమి కారణంగా సమస్య తీవ్రమవుతోంది.
నిర్లక్ష్యమే శాపమై..
కరోనా మొదటి వేవ్‌లో గ్రామీణులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరూ తమ గ్రామంలోకి రానీయకుండా ముళ్ల కంచె అడ్డువేశారు. ఎవరైనా వస్తే ప్రశ్నించడంతోపాటు అధికారులకు సమాచారం అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ఎక్కడా కఠిన ఆంక్షలు కానరావడం లేదు. గ్రామాల్లోనూ జనం యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కనీసం మాస్కులు ధరించడం లేదు. కొందరికి కరోనా సోకినా దానిని బయట పడనీయకుండా తిరుగుతూ ఇతరులకు వ్యాపింపజేస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతాలు హాట్ స్పాట్‌లు మారాయి. వైరస్ విపరీతంగా సోకుతుండటంతో వేలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు.
తూతూమంత్రంగా ఫీవర్ సర్వే
జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి అనుమానితులకు పరీక్షలు చేసి ఆస్పత్రులకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయించింది. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లోనూ ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాల్సి ఉంది. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్ సెంటర్లకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో అసలు సర్వే చేస్తున్న దాఖలాలే కానరావడం లేదు. అధికారుల పర్యవేక్షణ కరవవడం, స్థానిక పంచాయతీ పాలకులు సైతం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
పెసరవాయిలో లాక్‌డౌన్
గడివేముల, న్యూస్‌టుడే : గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో వైరస్ పెద్దఎత్తున విజృంభిస్తోంది. గ్రామంలో 3,589 మంది జనాభా ఉండగా వారిలో 160 మందికి కరోసా సోకడం గమనార్హం. ప్రస్తుతం గ్రామంలో 139 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 105 మంది టిడ్కో సెంటర్లలో చికిత్స తీసుకుంటుండగా, 30 మంది హోం ఐసొలేషన్‌లో, మరో నలుగురు కర్నూలు సర్వజన ఆస్పత్రిలో ఉన్నారు. పలువురు అనుమానితులు సైతం ఉన్నారు. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గ్రామంలో లాక్‌డౌన్ విధించారు. కొత్త వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా రహదారులను దిగ్బంధనం చేశారు. అన్ని వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. గ్రామంలోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఇంటింటి సర్వే చేస్తున్నారు.
ఇదీ చదవండి:
'రెండో విడత కరోనా వ్యాప్తిపై హెచ్చరించినప్పటికీ.. పెడచెవిన పెట్టారు'