తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలు నిషేధమని దేవాదాయశాఖ ప్రకటించింది. మరోవైపు పుష్కరాల కోసం ఘాట్ల నిర్మాణం వంటి ఏర్పాట్లన్నీ సాగిపోతుండటంతో అసలు పుష్కర స్నానాలకు అనుమతిస్తారా లేదా అనేది గందరగోళంగా మారింది. ఈ నెల 20 నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్నా నేటికీ ఈ విషయంపై స్పష్టత రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు కొవిడ్ రెండో దఫా వ్యాప్తి ఉంటుందని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పుష్కరాలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అధికారవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తూనే భక్తులను నియంత్రించాలని యోచిస్తున్నాయి. అయితే పుష్కరాలకు ఒక వైపు ఏర్పాట్లు చేస్తూ.. మరోవైపు భక్తులను నియంత్రించగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలోనే దేవరగట్టులో దసరా సందర్భంగా జరిగిన కర్రల సమరాన్ని ఈ సందర్భంగా ఆ జిల్లా వాసులు ఉదహరిస్తున్నారు. 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినా.. 30 వేల మందిని నియంత్రించలేకపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
నాటి పుష్కరాలకు 80 లక్షల మంది
మకరరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. కార్తీక శుద్ధ షష్ఠి శుక్రవారం (నవంబరు 20) నుంచి కార్తీక బహుళ పాడ్యమి వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయని పండితులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు తుంగభద్ర నది ప్రవహించే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కరోనా కారణంగా పుష్కరాల నిర్వహణకు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఆ రెండు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్ణాటక అధికారులు మంత్రాలయం వెళ్లాలంటూ అక్కడివారికి చెబుతున్నారని సమాచారం. అక్కడ తగిన ఏర్పాట్లు లేని కారణంగా చాలామంది కర్నూలు జిల్లా నదీ తీరానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 2008 పుష్కరాలకు కర్నూలు జిల్లాకు దాదాపు 80 లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా. ఈ నేపథ్యంలో పుష్కర ఏర్పాట్లు చేస్తూ.. నియంత్రించాలనుకునే ప్రభుత్వ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. జిల్లా యంత్రాంగం పుష్కర పనులు, ఏర్పాట్లపై నిరంతరం సమీక్షిస్తోంది. మంత్రులు సైతం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం