Bhadradri Laddu controversy: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి రాముడి సన్నిధిలో పాడైన లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తున్నారని కొందరు భక్తులు గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు కూడా భక్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద తయారీ కేంద్రమైన పోటును సీజ్ చేసేందుకు సోమవారం పోలీసులు ప్రయత్నించగా ఆలయ సిబ్బంది అడ్డుకుని ధర్నా చేశారు.
చివరకు ఈ వివాదం తేల్చేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ రంగంలోకి దిగింది. లడ్డూ ప్రసాదం నాణ్యతపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు రూ.25 విలువైన 100 గ్రాముల లడ్డూల తూకం పరిశీలించారు. తయారీకి వాడుతున్న సరకుల దిట్టంతో పాటు వాటి నాణ్యతను గమనించారు. అనంతరం లడ్డూ ప్రసాదంపై వివరాలు సేకరించింది.
అసలేం జరిగిందంటే.. : ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు గత నెల 23న ప్రారంభం కాగా, ఈ నెల 1న తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం ప్రధాన ఉత్సవాలు నిర్వహించారు. గతంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచురుని 1.8 లక్షల లడ్డూలను తయారు చేయించారు. అందులో 50 వేల వరకు మిగిలినట్లు అంచనా. ఆదివారం కొంతమంది భక్తులు వీటిని కొనడంతో బూజు ఉన్న విషయం బయటకు వచ్చింది. ఆ రోజుకు సుమారు 32 వేలు మిగిలినట్లు తెలిసింది. ఇవన్నీ పాడై ఉంటే రూ.8 లక్షల నష్టం తప్పదు. ఇందులో కొన్ని మాత్రమే దెబ్బతిని ఉంటే నష్టం కొంత తగ్గనుంది. బూజు పట్టిన వాటిని ఏం చేశారన్నది వెల్లడించాలి.
నిశిత పరిశీలన : విచారణ బృందం ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ నిజానిజాలను తెలుసుకుంటోంది. భక్తుల రాకను అంచనా వేయడంలో స్పష్టత కొరవడిందా? లేక లడ్డూలను చుట్టే క్రమంలో నీటిని ఉపయోగించారా? తదితర వివరాలు తెలుసుకుంటున్నారు. బయట కౌంటర్లకు వెళ్లిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేటప్పుడు వాటి శుభ్రత, ప్రమాణాలపై దృష్టి సారించారా లేదా అనే సమాచారం సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు సమన్వయ లోపం ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఇది భక్తుల మనోభావాలు ఆరోగ్యానికి సంబంధించి కావడంతో నేడు మరోసారి పరిశీలించి వివరాలను వెల్లడించే వీలుంది. ప్రస్తుతం పాత లడ్డూలు ఇక్కడ లేవని, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నివేదిక వచ్చాక స్పష్టత వస్తుందని విచారణ అధికారి జ్యోతి తెలిపారు. పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని అన్నారు.
ఇవీ చదవండి :