సరిపడా గదులు లేకపోవడంతో కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కంబళదిన్నె ఉన్నత పాఠశాల విద్యార్థులు టార్పాలిన్ కిందే విద్యనభ్యసించాల్సిన దుస్థితి. ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను 2017లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు 330మంది చదువుతున్నారు. జడ్పీ పాఠశాలగా స్థాయి పెంచినప్పటికీ రెండు గదులు మాత్రమే కేటాయించారు.
వాటిల్లో తొమ్మిది, పది తరగతులకు బోధించేవారు. మిగిలిన విద్యార్థుల బోధనకు గదులే లేవు. ప్రస్తుతం ఆ రెండు గదులకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ఆరు నుంచి పది తరగతుల వరకు బడి ఆవరణలోనే పాఠాలు బోధిస్తున్నారు. వారం రోజుల నుంచి ఎండలు ఎక్కువ కావడంతో నీడ కోసం టార్పాలిన్‌ను ఏర్పాటుచేసినట్లు ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ రైతు ఈ టార్పాలిన్‌ను సాయం చేశారని చెప్పారు.
ఇదీ చదవండి:
'రూల్ ఆఫ్ లా' లేకుండా చేస్తూ ప్రభుత్వ ఉగ్రవాదం తీసుకొచ్చారు: చంద్రబాబు