Central Minister Fired on CM Jagan: రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి దేవ్‌సింగ్ చౌహాన్ విమర్శించారు. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి ప్రభుత్వ అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉచిత పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతోందని.. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయని తెలిపారు. ఉపాధి లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని.. పంచాయతీల ఖాతాల్లో కేంద్రం వేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకున్నట్లు.. సర్పంచుల సంఘం ప్రతినిధులు తనకు వినతిపత్రం అందించారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యంతోపాటు గ్రామస్వరాజ్యంపై దాడి చేసినట్లేనని అన్నారు.
ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. ఈ ప్రభుత్వం వైన్స్, మైన్స్పైనే ఆదారపడి పాలన సాగిస్తోందని విమర్శించారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు జీతాలు ఇచ్చేందుకు డబ్బుల్లేవు కానీ వాలంటీర్లకు డబ్బులు చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల కార్యకర్తలను అణచివేయడం, వారిపై దాడి చేయడమే ఈ వాలంటీర్లు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రంగా ఉన్నారని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వం ఒక్క సీటు కూడా గెలవదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పకుండా భాజపాకు ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు.
"సరైన పాలన అందించడంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఉచిత పథకాలతో కాలం వెళ్లబుచ్చుతోంది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఉపాధి లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. ఈ ప్రభుత్వం వైన్స్, మైన్స్ పాలన సాగిస్తోంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు జీతాలు ఇచ్చేందుకు డబ్బుల్లేవు.. కానీ వాలంటీర్లకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇతర పార్టీల కార్యకర్తలను అణచివేయడం, వారిపై దాడి చేయడమే ఈ వాలంటీర్లు పనిగా పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఒక్క సీటు కూడా గెలవదు". - దేవ్‌సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి
ఇవీ చదవండి: