కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవరు నాగిరెడ్డికి మూడు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. ఎస్‌బీఐ ఖాతాలో నెలవారీ వేతనం పడుతుంది. అంతేకాకుండా కొంత సొమ్మును దాచుకున్నారు. తాను విధుల్లో ఉన్న సమయంలో జూపాడుబంగ్లా మండలం పారుమంచాల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతా నుంచి ఈనెల 3న రూ.3 వేలు విత్‌డ్రా చేసినట్లు చరవాణికి సందేశం వచ్చింది. అదే రోజున నందికొట్కూరులోని ఆంధ్రా బ్యాంకు ఖాతా నుంచి రూ.2,500 విత్‌డ్రా చేసినట్లు మళ్లీ సందేశం వచ్చింది. నందికొట్కూరు ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.9,999 అదేరోజు ఆగంతుకులు మాయం చేశారు. ఈనెల 4న ఎస్‌బీఐ ఖాతా నుంచి మరో రూ.9,999 మాయమయ్యాయి. ఖాతాల్లో సొమ్ము మాయమవుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న నాగిరెడ్డి తన ఖాతాలో మిగిలిన సొమ్మును తీసేసుకున్నారు. రెండు రోజుల్లో రూ.25,498 పోయిన విషయంపై నందికొట్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మట్టకందాల గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవరు సామేలుకు ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.వెయ్యి డ్రా చేసుకోగా, మరో రూ.1000 డ్రా చేసినట్లు చరవాణికి సందేశం వచ్చింది. వెంటనే బ్యాంకు వద్దకు వెళితే.. తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా చెబుతున్నట్లు వాపోయారు. తన లాంటి బాధితులు 15 మంది పైగానే ఉన్నారని, ధైర్యంగా ఎవరూ ముందుకు రావటం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: