కర్నూలు నగరంలో కుడా కార్యాలయం బోర్డు
కర్నూలు అర్బన్ డవలెప్‌మెంట్ అథార్టీ(కుడా) ఏడాదిన్నరగా చతికిల పడింది. ప్రణాళికల పంథా కరవై అభివృద్ధి అటకెక్కింది. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో ‘కుడా’ ఉన్నట్టా? లేనట్టా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నా దీనిపై దృష్టి సారించలేదు.
జిల్లాలో ‘కుడా’ను 2017 మార్చి 24న ఏర్పాటు చేశారు. దీని పరిధిలో కర్నూలు, డోన్, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల మున్సిపాల్టీ, నంద్యాల మండలంలో అయిదు గ్రామాలు కలిపి మొత్తం 35 మండలాలు కుడా పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే పలు అర్బన్ అథార్టీలు చేసిన అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు అప్పట్లో కమిటీ సభ్యులను తిరుపతి, దిల్లీ, చండీఘడ్, రాజస్థాన్, ముంబయి, అహ్మదాబాద్ పర్యటనకు గత ప్రభుత్వం పంపింది. అక్కడ అభివృద్ధిలో కొన్నింటిని కర్నూలులో అమలుచేసేందుకు నిర్ణయించారు. కేసీ కెనాల్‌పై అయ్యప్పస్వామి దేవస్థానం వెనుకవైపు దుకాణ సముదాయం ఏర్పాటుకు ప్రణాళిక చేశారు. ఈ ప్రదేశాన్ని విద్యుత్తు దీపాల వెలుగులతో నింపి ఆకర్షించేలా తీర్చిదిద్దాలని, కాల్వ గట్టుపై టైల్స్ పరిచి ఫుడ్ కోర్టులు, చిన్నారులకు ఆటవిడుపుగా బొమ్మల అమ్మకాలు సాయంత్రం వేళల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించినా నేటికీ అమలు కాలేదు.
రూ.10 కోట్ల కేటాయింపు
గతంలో ‘కుడా’కు ఛైర్మన్‌గా తెదేపా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టిని నియమించారు. వైస్ ఛైర్మన్‌గా అప్పటి జేసీ ప్రసన్నకుమార్ బాధ్యతలు చేపట్టి పురపాలక భవనాన్ని లీజుకు తీసుకుని ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. తొలుత రూ.2 కోట్లు విడుదల చేయగా కర్నూలు, నంద్యాల, డోన్ పరిధిలో ఫుట్‌పాత్, డివైడర్ల మధ్య పూల చెట్లతో కుండీలపై ‘కుడా’ ముద్ర వేసి ఏర్పాటు చేశారు. మిగిలిన నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోయాయి.
పెరిగిపోయిన అనధికార లే-అవుట్లు
ఈ విభాగంలో వీసీగా పనిచేసిన విజయ్ మనోహర్ నెలన్నర కిత్రం పదవీ విరమణ పొందారు. ఈ పోస్టుతోపాటు, ఛైర్మన్‌గా ఇంతవరకు ఎవరినీ నియమించ లేదు. పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువమంది డిప్యూటేషన్‌పై వచ్చినవారే. అభివృద్ధి పక్కన బెడితే అక్రమ లే-అవుట్ల పైనా ఎవరూ దృష్టి సారించడం లేదు. కుడా పరిధిలో గ్రామాల్లో సైతం లే-అవుట్లు వేసి విక్రయాలు చేస్తున్నారు. లే-అవుట్ రెగ్యులైజేషన్ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) కింద నోటీసులందుకున్న లే-అవుట్లు 250 ఉన్నాయంటే క్షేత్రస్థాయిలో అనధికార ప్లాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్ఛు.
ప్రభుత్వ స్థలాలు అభివృద్ధి చేసి....
ప్రభుత్వ స్థలాలు అప్పగిస్తే వాటిని అభివృద్ధి చేసి కుడా పరిధిలో అమ్మేందుకు గతంలో ప్రత్యేక ప్రణాళిక చేశారు. కర్నూలు నగరంలోని శిథిలావస్థలో ఉన్న బి-క్యాంపు ఆర్‌అండ్‌బీ గృహాలు, జోహరాపురం డంపింగ్‌యార్డు సమీపంలో స్థలాలు, నంద్యాలలో కొన్ని స్థలాలు అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాశారు. నన్నూరు పరిధిలోని కొండను చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేందుకు చర్యలు చేపట్టిన కొద్దిరోజులకే ప్రభుత్వం మారింది. ఏడాదిన్నరగా కుడాపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దృష్టి పెట్టక పోవడంతో ప్రణాళికల్లేక అభివృద్ధి ఆమడ దూరమైంది.
ఇదీ చదవండి: