AP CM Jagan released PM fifth tranche Rythu Bharosa funds: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండలో నేడు ఐదో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అనంతరం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న జగన్.. రైతన్నకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని వ్యాఖ్యానించారు. పెట్టుబడి రాయితీ విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని.. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఆర్బీకేలు ఏర్పాటు చేశామన్న సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోసారి మోసపూరిత మేనిఫెస్టోతో జనం ముందుకు చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల.. కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించిన సీఎం జగన్.. వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. ఐదో ఏడాది.. తొలి విడుత కింద రూ.3,900 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామన్న జగన్.. 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లోకి నిధులను జమ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ రైతన్నకు నేటి నిధులతో కలిపి మొత్తం రూ.61,500 సాయాన్ని అందించామన్నారు. గత నాలుగేళ్లుగా 22.70 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు.. రూ.1,965 కోట్లను నేరుగా వాళ్ల ఖాతాల్లోకి జమ చేశామని ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు.
రాష్ట్రంలో కరువులు, వలసలు తగ్గిపోయాయి.. అనంతరం ఏ సీజన్‌లో అయిన పంట నష్టం జరిగితే.. అదే సీజన్‌లో నష్ట పరిహారాన్ని అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని.. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నలకు ప్రభుత్వం అండగా నిలబడిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్న జగన్.. రాష్ట్రంలో కరువులు, వలసలు కూడా తగ్గిపోయాయని అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క కరువు మండలం కూడా లేదని ఆయన వెల్లడించారు.
3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం.. రైతన్నలు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతోందని జగన్ వివరించారు. ఇప్పటివరకూ అన్ని జిల్లాల నుంచి 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ధాన్య సేకరణపై రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామన్న జగన్.. రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ వ్యయం రూ. 77 వేల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. గతంలో గ్రామ స్థాయిలో భూ వివాదాలు ఎక్కువగా ఉండేవని.. ఆ వివాదాలను పరిష్కరించేందుకు రైతన్నలకు భూమిపై సర్వ హక్కులు కల్పించేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేశామని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి