రోజురోజుకు ఆకాశన్నంటుతున్న నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలతో ఇంట్లో అల్పాహారం చేసుకున్నా కనీసం ఒక్కొక్కరికీ 20 నుంచి 30 రూపాయలవుతోంది. ఇక నూనెతో చేసే పదార్థాల గురించి చెప్పాల్సిన పనిలేదు. బయట ఎక్కడ హోటల్‌లో తిన్నా.. ఒక్కో టిఫిన్ ధర 30 రూపాయలకు తక్కువ ఉండదు. కానీ కర్నూలులోని ఓ టిఫిన్ సెంటర్‌లో ఏది తిన్నా ప్లేట్ 10 రూపాయల మాత్రమే వసూలు చేస్తారు. మసాలా దోశ, పూరీ, ఇడ్లీ, మైసూరు బజ్జీ, వడ, ఉగ్గానీ ఏది తినాలన్నా కేవలం ప్లేట్‌కు పది రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఉగ్గానీలోకి బజ్జీ కావాలంటే మాత్రం అదనంగా మరో 5రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.
కర్నూలు రోజావీధిలో ఉన్న రేణుకాదేవి టిఫిన్ సెంటర్‌ను నాగేశ్వరరెడ్డి నడుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఉండే పేద, మధ్యతరగతి వారి కోసం పదేళ్ల క్రితం పది రూపాయలకే టిఫిన్ అందించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా.. ధరలు ఎంత పెరిగినా ఆ టిఫిన్ సెంటర్‌లో మాత్రం ప్లేట్ టిఫిన్ ధర మాత్రం పెరగలేదు. ఉదయం టిఫిన్లతోపాటు సాయంత్రం పునుగు, మిర్చిబజ్జి, మసాలా దోశ సైతం ఇదే ధరకు విక్రయిస్తున్నారు. రుచి, శుచిలో రాజీపడకపోవడంతో పెద్దఎత్తున ప్రజలు టిఫిన్ తినేందుకు ఇక్కడి వస్తున్నారు. ధర తక్కువ ఉండటంతో పాటు టేస్ట్ బాగుంటుందని కస్టమర్లు అంటున్నారు.
ఈ హోటల్ ద్వారా 8 మంది ఉపాధి పొందుతున్నారు. ఎవరూ యజమానిలా కాకుండా అందరూ కలిసి పనిచేసి వచ్చిన దానిలో సంతృప్తిపడతామని నిర్వాహకులు తెలిపారు. పది రూపాయల టిఫిన్‌కు విశేష ఆధరణ లభించడంతో దీనిని కొనసాగిస్తున్నామంటున్నారు. -నాగేశ్వర్ రెడ్డి, టిఫిన్ సెంటర్ యజమాని
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దీపావళి.. ఆనందోత్సాహాల్లో ప్రజలు